Warangal Ganja Batch Arrested: అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు స్మగ్లర్ల తోపాటు సుమారు 50 లక్షల విలువ చేసే 192 కిలోల గంజాయి, ఒక కారు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గజ్జి సహదేవ్ భూపాల్‌పల్లి జిల్లా, జై యోగేశ్వర్ షిరిడీ, మహారాష్ట్ర, సోమనదత్ రాందాస్ కాలాటి, మహారాష్ట్ర కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశామని మరో ముగ్గురు నిందితులు పాండు, ఒరిస్సా.. లక్ష్మీ తాటే, వికాస్ తాటే మహారాష్ట్ర కు చెందినవారు ప్రస్తుతం పరారీలో వున్నారని పోలీస్ కమిషనర్ తెలిపారు.
భూపాలపల్లి జిల్లాకు చెందిన నిందితుడు గజ్జి సహదేవ్ కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తుండగా మిగతా నిందితులతో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారి గంజాయి రవాణాకు దారి తీసిందని సీపీ తెలిపారు. కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు మండలం, తునుగొండ గ్రామ పరిసరాల నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు రహస్యంగా తరలిస్తున్నారని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం, ములుగు మీదుగా మహారాష్ట్రకు కారులో గంజాయిని తరలిస్తుండగా కమిషనరేట్ పరిధిలోని దామెర పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీస్ లు వాహన తనీఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డారని సీపీ తెలియజేశారు. 96 ప్యాకెట్లలో 192 కిలోల గంజాయి తరలిస్తున్నారని, దీని విలువ 50 లక్షల విలువ చేస్తుందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.