వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు వేర్వేరు సంఘటనలో భూ అక్రమణలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ నేత, 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ సహ ఐదుగురిని హనుమకొండ, ఇంతేజార్ గంజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ అరెస్టులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఫేక్ డాక్యుమెంట్స్‌తో భూ ఆక్రమణకు పాల్పడిన 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ తో పాటుఅతని డ్రైవర్ పడాల కుమారస్వామిని హనుమకొండ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. 
హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారులు నరాల సునీత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాననగర్ ప్రాంతానికి చెందిన నరాల సునీత సర్వే నంబర్ 44లో వున్న తన స్థలంలో గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటి నుంచి అనుమతి పొంది ఇంటి నిర్మాణం ప్రారంభించడంతో, ఈ స్థలాన్ని అపార్ట్మెంట్ నిర్మాణం కోసం ఇవ్వాల్సిందిగా (డెవలప్మెంట్ కోసం) ఇదే ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, అతని కారు డ్రైవర్ పడాల కుమారస్వామి బాధితురాలతో పాటు ఆమె భర్త శ్రీనివాస్ ను అడుగగా ఇందుకు బాధితురాలు అంగీకరించకపోవడంతో, ఈ ప్రదేశంలో ఇంటి నిర్మాణం ఎలా చేస్తారు. మీ అంతు చూస్తానని బాధితులను కార్పొరేటర్ బెదిరించాడు. ఈ స్థలాన్ని కబ్జా చేయాలకున్న కార్పొరేటర్ తప్పుడు పత్రాలతో సర్వేనంబర్ 648లోని స్థలం ఇదే అంటూ వచ్చి ఫిర్యాది స్థలంలోనికి అక్రమంగా ప్రవేశించి ఇంటి నిర్మాణం పనులు నిర్వహిస్తున్న ఇంటి నిర్మాణ కార్మికులను కార్పొరేటర్ డ్రైవర్ బెదిరించడంతో పాటు, బాధితురాలి స్థల సరిహద్దుకోసం నిర్మించిన ప్రహరీగోడను కార్పొరేటర్ తన డ్రైవర్తో కల్సి బోలెరో వాహనంతో ఢీ కొట్టి ప్రహరీ గోడను నేలమట్టం చేసి బాధితుల భూమిలో హద్దు రాళ్ళను ఏర్పాటు చేసారు. 


ఈ ఆక్రమణపై బాధితురాలు హనుమకొండ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న హనుమకొండ పోలీసులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థలానికి సంబంధించిన పత్రాలను పరిశీలించడంతో పాటు పహాణీ పత్రాలు, ల్యాండ్ సర్వీర్ అందజేసిన నివేదిక ఆధారాలతో పాటు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిన పోలీసులు కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, డ్రైవర్ పడాల కుమారస్వామి భూ అక్రమణ పాల్పడి, బాధితులను బెదిరింపులకు పాల్పడటంతో పాటు స్థలంలోని ప్రహారీ గోడను కూల్చివేసినట్లుగా పోలీసులు చేసిన ప్రాధమిక విచారణలో నిర్ధారణకావడంతో హనుమకొండ పోలీసులు కార్పొరేటర్ మరియు డ్రైవర్ను గత రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ ఆక్రమణ కేసు విచారణలో కార్పొరేటర్కు తప్పుడు పత్రాలను సృష్టించి బాధితుల స్థలానికి యజమానిగా పెర్కొంటూ కార్పొరేటరు రిజిస్ట్రేషన్ చేసిన స్థల యజమానులుగా చెలామణివవుతున్న మరో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు ఈ కేసులో నిందితులు చేర్చడం జరిగింది.


మరో ఘటనలో అరెస్ట్...
దేశాయిపేటలోని సర్వేనంబర్ 90/బిలో భూమిని అక్రమణ చేసేందుకు యత్నించిన వరంగల్ నగరానికి చెందిన పొక్కులు చిరంజీవిరావు. గొడాసి అశ్విన్ కుమార్, సురోజు రమేష్ లను ఇంతేజార్గంబీ పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు బొమ్మకంటి శ్రీనివాస్, మునుగంటి రమేష్ లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ సంఘటనలో నిందితులు తప్పుడు పత్రాలను సృష్టించడంతో పాటు ప్రభుత్వ సూచించిన ధరల పట్టేక కన్న అతి తక్కువ ధరకు భూమిని ఎలాంటి లావాదేవీలు జరగకున్న క్రయ విక్రయాలు జరిగినట్లుగా లేని భూమికి సంబంధించి ప్రతాలను సృష్టించారు ఈ నిందితులు. 


దేశాయిపేటలోని సర్వే నంబర్ 90/బి భూమి తాము కొనుగోలు చేసినట్లుగా నిందితులు అసలు భూ యజమానులను బెదిరించి భూమిని ఆక్రమించడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా క్షేత్ర స్థాయితో పాటు భూమి సంబంధించి పత్రాలను పరిశీలించిన పోలీసులు నిందితులు భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.