Warangal CP Ranganath on Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. ఆరోపణలు నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని బండి సంజయ్ కు సీపీ రంగనాథ్ సవాల్ విసిరారు. అయితే మరో ప్రెస్ మీట్ అవసరం ఉండదని, తాను అనుకున్నానని కానీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై పోలీసుగా స్పందించి వివరాలు వెల్లడిస్తున్నాం అన్నారు. నాలుగేళ్లు నల్గొండ ఎస్పీగా చేశాను, ఖమ్మంలోనూ తాను పని చేశానని.. కానీ కొన్నేళ్ల కిందటి వరకు లేని ఆరోపణలు బండి సంజయ్ ఇప్పుడు కేసులో ఇరుక్కోవడంతో లేనిపోని నిందలు, ఆరోపణలు చేశారన్నారు. తనపై బండి సంజయ్ చేసిన సెటిల్మెంట్ ఆరోపణలు నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానన్నారు వరంగల్ సీపీ రంగనాథ్. ప్రమాణం చేయాలని పోలీసులను కోరటం విచిత్రంగా ఉందన్నారు. మాల్ ప్రాక్టీస్ అని ముందే చెప్పామని, కానీ టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీకైందని దుష్ప్రచారం చేశారన్నారు. సత్యంబాబు కేసు తాను చూడలేదన్నారు. ఆ కేసులో తాను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదని స్పష్టం చేశారు.


సెటిల్మెంట్ లు చేశానని తనపై బండి సంజయ్ చేసిన ఆరోపణలు చూసి నవ్వాలో, ఏడవాలో తనకు అర్థం కాలేదన్నారు. పలు కేసులలో తాను కఠిన చర్యలు తీసుకుంటే బాధ కలుగుతుందన్నారు. వాళ్లు పోలీసులపై ఆరోపణలు చేయడం సహజమే. కానీ తాను ఎవరిపక్షాన ఉంటానో ప్రజలకే తెలుసునన్నారు. తాను ఇప్పటివరకూ పనిచేసిన చోట ఎక్కడైనా సెటెల్మెంట్ లు, దందాలు, తనకు లాభం చేకూరేలా ఏమైనా చేసినట్లు నిరూపిస్తే తాను పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ పై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదన్నారు.


ఈటల రాజేందర్ ను విచారించాం..
విధి నిర్వహణలో భాగంగా టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను విచారణకు పిలిచాం. ఈటల విచారణకు హాజరై తనకు ఎవరి నుంచి వాట్సప్ లో పేపర్ వచ్చిందో చూపించారు. ఆయన స్టేట్మెంట్ తీసుకున్నాం. మేం అడిగిన ప్రశ్నలకు బదులిచ్చి ఈటల వెళ్లిపోయారని రంగనాథ్ చెప్పారు. సాక్ష్యాలు వివరాలు సేకరించినంత మాత్రాన బీజేపీ నేతల్ని కేసులలో ఇరికిస్తారని భావించకూడదన్నారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేశానన్నారు. సెటిల్మెంట్ లు, దందాలు, భూ ఆక్రమణ చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించానన్నారు. గ్రీవెన్స్ ఉందని, బాధితులు భారీ సంఖ్యలో వస్తారని.. కానీ తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. పేదవారు, సామాన్యులు, అమాయకులు తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రీవెన్స్ కు వచ్చేవారని చెప్పారు. 


ఇది పిల్లల భవిష్యత్.. రాజకీయం చేయవద్దు.. 
టెన్త్ పేపర్ లీకేజీ కేసును రాజకీయం చేయవద్దన్నారు. పిల్లల భవిష్యత్ కు సంబంధించిన కేసులో నేతల ప్రమేయం అవసరం లేదన్నారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని తమకు ఏ భేదం లేదన్నారు. సీఆర్పీసీ 91 ప్రకారం కాల్ డేటా సేకరిస్తున్నాం. ఈ కేసులో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం కానీ ఎవరినీ ఇందులో ఇరికించే ప్రయత్నం చేయడం లేదన్నారు. తాను ఎవరిపై పరువునష్టం దావా వేయడం లేదని, కానీ తనపై ఆరోపణలు చేయడం అంటే దర్యాప్తు సంస్థను విశ్వసించకపోవడమే అన్నారు సీపీ రంగనాథ్. తనపై లేనిపోని ఆరోపణలు, వ్యాఖ్యలు చేయడం అంటే దర్యాప్తు చేస్తున్న వారిని బెదిరించడం కిందకి వస్తుందన్నారు.