పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జనియించగా... అని సుమతీకారుడు ఎప్పుడో కుమారుడి విజయంపై తండ్రి ఏ రకంగా ఫీల్ అవుతారనే విషయం చాలా స్పష్టంగా ఈ పద్యంలో చెప్పారు. కొడుకు పుట్టగానే కాదు అతడు ప్రయోజకుడు అయినప్పుడే ఆ తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని ఆ పద్యం సారాంశం. అలాంటి విజయాన్ని తన తండ్రికి అందించాడు ఓ కుమారుడు.  


ఇటీవల ప్రకటించిన నీట్‌లో రాణించిన హోంగార్డ్ కుమారుడిని వరంగల్ పోలీస్ కమిషనర్  తరుణ్ జోషి బుధవారం అభినందించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న మార్గం శ్యాం కుమారుడు మార్గం మణికంఠ ఇటీవల ప్రకటించిన నీట్‌ ఫలితాల్లో 720 మార్కులకు గాను 646 మార్కులు సాధించాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలో తనకంటూ ఒక సీటును గ్యారేంటీ చేసుకున్నాడు. 


తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి ఉద్యోగం చేస్తూ తనపై ఉంచిన నమ్మకంతో ఎంతో కష్టపడి చదివాడు మణికంఠ. అద్భుతమైన ప్రతిభతో నీట్‌లో మెరిశాడు. ఈ సందర్భంగా వరంగల్ నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి హోంగార్డ్ కుమారుడు మణికంఠను కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పుష్పాగుచ్చం అందజేసి అభినందించారు. స్వీట్ తినిపించారు. హోంగార్డ్ శ్యాంను కూడా పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. 


తమ బాస్ స్వయంగా కొడుకుని అభినందించడం చూసిన ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. తమ అబ్బాయి సాధించిన ర్యాంకుతో డిపార్టుమెంటులోనూ గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు హోంగార్డ్ మార్గం శ్యామ్. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిరంతరం విధుల్లో బీజీగా ఉన్నా తమ పిల్లల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న పోలీస్ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షలతోపాటు అన్ని రంగాల్లో పోలీస్ పిల్లలు రాణించడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. నీట్, జె.ఈ. ఈ అడ్వాస్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బంది పిల్లలందరికి పోలీస్ కమిషనర్ అభినందనలు తెలియజేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా భవిష్యత్తులోనూ పోలీసు సిబ్బంది పిల్లలు క్రమశిక్షణతో ఇలాంటి విజయాలు సాధించి డిపార్ట్మెంట్‌కి పేరు తెస్తారని ఆశిస్తున్నానని తెలిపారు