Sri Lakshmi Narasinmha Swamy temple: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. బుధవారం ఉదయం నుండి యంత్ర ప్రతిష్ఠాపన, మూర్తి స్థాపన, ప్రాణ ప్రతిష్ట, ధ్వజ స్తంభం, ఆలయ గోపురం ప్రతిష్ఠ, ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల వితరణ వంటి కార్యక్రమాలతో గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహ పున: ప్రతిష్ఠాపన కార్యక్రమం ముగిసింది.


ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. ప్రతిష్ఠాపన పూర్తి కావడంతో ఇక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ప్రజలకు దర్శనం ఇస్తారని చెప్పారు. అందరూ ఆ దేవుడిని దర్శించుకొని తరించాలన్నారు. మన పాపాలు పోగొట్టి, పుణ్యాలు కలిగించే వాడే దేవుడు. అందుకే దేవుడు అందరివాడు. దేవుని ముందు అందరూ సమానులు. కొత్త ప్రభుత్వం వచ్చాక దేవాలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ బాగా జరిగింది. భక్తి ప్రచారం ఇంకా జరగాలి. దైవ సన్నిధి ఆనందాన్ని పెంచుతుంది. అందరికి పంచుతుంది అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి పూనుకున్న తిరుమలాయ పల్లి గ్రామస్థులు అభినందనీయులు. గ్రామస్థులు పూనుకున్నారు ప్రభుత్వం సహకరించింది. ఈ మహత్కార్యానికి పూనుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి, తిరుమలాయ పల్లె ప్రజలకు మంగళా శాసనములు! శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. 


మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పాద స్పర్శతో తిరుమలాయ పల్లె గ్రామం పావనం అయిందన్నారు. సీఎం కీసీఆర్ చల్లని చూపుతో  తెలంగాణలోని దేవాలయాలు అన్నీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పారు. నాంచారి మడూరు, సన్నూరు, పాలకుర్తి, బమ్మెర, వల్మీడి తదితర గ్రామాలలో గుడులన్నింటికి పూర్వ వైభవం తెస్తున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత గొప్పగా జరిగింది. చినజీయర్ స్వామి హాజరు కావడం మా అదృష్టం. ఈ గ్రామ ప్రజలు చేసుకున్న పుణ్యం. గ్రామ ప్రజలంతా ఐక్యంగా, మనిషికి కొన్ని డబ్బులు వేసుకొని మరీ కలిసి కట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.50 లక్షల వరకు మంజూరు చేయించానని, మరో 50 లక్షల నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.


మీ అందరికీ ఈ పర్వదిన శుభాకాంక్షలు! శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపా కటాక్షాలు అందరి పైనా ఉండాలని ఆకాంక్షించారు. సీఎం కీసీఆర్  పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, శాంతి సౌఖ్యాలతో హాయిగా ఉండాలని ఆకాంక్షించారు. కేసీఆర్  పరిపాలన సుదీర్ఘంగా సాగాలని కోరుకున్నారు. రాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు పునర్ వైభవం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రతినిధులు, ప్రముఖులు, ప్రజలు, చుట్టు ముట్టు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.