వరంగల్ : చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దొంగతో పాటు, ఈ కేసు సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులను ఐనవోలు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఐనవోలు దేవాలయం పరిసర ప్రాంతంలో ఈ చైన్ చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణంతో పాటు లక్ష ఎనభైవేల రూపాయల నగదు ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


ఈ అరెస్టు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్ వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలం, వంచనగిరి ప్రాంతానికి చెందిన నిందితుడు ఎల్లబోయిన హరీష్ ఈ నెల 21వ తేదిన యాదాద్రి జిల్లా బీబీనగర్ ప్రాంతానికి చెందిన గండు వసంత అనే మహిళ  చెల్లించుకోనేందుకుగాను ఐనవోలు జాతరలో ఎల్లమ్మగుడి వద్ద బోనం ఎత్తుకోనే సమయంలో సదరు మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును చోరీ చేసాడు. ఈ చోరీపై ఫిర్యాదు నమోదు చేసుకున్న ఐనవోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


జాతరలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడి గుర్తించారు పోలీసులు. అయితే నిందితుడిని కాశిబుగ్గ ప్రాంతంలో అదుపులోని తీసుకొని విచారించగా చైన్ స్నాచింగ్ చేసిన అనంతరం పంచనగిరికి చెందిన మరో నిందితుడు శోబోతు బిక్షపతి సూచనల మేరకు అతనితో కలసి బంగారు పుస్తెల తాడును నెక్కోండ మండలం అలంకారిపేట గ్రామానికి చెందిన బోయినపల్లి సూర్య ప్రకాశ్ కు విక్రయించారు. ఇందుకుగాను నిందితులకు 2లక్షల 6వేల రూపాయలు ఇవ్వగా, ఇందులో ప్రధాన నిందితుడు హరీష్ లక్ష ఎనబైవేల రూపాయలను వుంచుకోగా మిగితా ఇరువైఆరు వేల రూపాయల మరో నిందితుడు బిక్షపతి ఇచ్చినట్లు ప్రధాన నిందితుడు అంగీకరించాడు. 


నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మిగితా ఇద్దరు నిందితుల వద్ద నుండి చోరీ సొత్తుతో పాటు డబ్బు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన ఏసిపి నరేష్ కుమార్, పర్వతగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, ఐనవోలు ఎస్.ఐ వెంకన్న మరియు ఐనవోలు సిబ్బందిని డిసీపీ అభినందించారు.


2 వారాల కిందట హైదరాబాద్ లో వరుస చోరీలు 
హైదరాబాద్ మళ్లీ చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ కాలనీలో ఓ వృద్ధురాలి మెడలో నుంచి ఓ దుండగుడు బంగారపు చైన్ లాక్కెళ్లాడు. వృద్ధురాలు నడుచుకుంటూ వెళుతుండగా బైక్ పై వచ్చిన దుండగుడు బైక్ ఆపి, వెనుక నుంచి వెళ్లి రెండు తులాల బంగారపు చైన్ లాక్కెళ్లాడు. ఈ దొంగతనం సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  


ఒంటరి మహిళలే టార్గెట్  
రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలనను టార్గెట్ చేసుకుని మెడలో బంగారు మంగళసూత్రాలు, చైన్లను లాక్కెళ్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఆరుచోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు కేటుగాళ్లు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొద్దుపొద్దున రెండుచోట్ల గొలుసులు లాక్కెళ్లారు. మరోవైపు ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్ర నగర్ కాలనీలోనూ ఓ మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు వెంబడించినా దొరకకుండా పారిపోయాడు. నాచారం పీఎస్ పరిధిలో నాగేంద్ర నగర్లో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వృద్ధురాలి మెడలో 5తులాల మంగళసూత్రం తెంపుకెళ్లారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని రామాలయం గుండు దగ్గర కూడా మహిళ మెడలోని పుస్తెల తాడును లాక్కెళ్లారు.