- రూ.49 కోట్లతో పలు అభివృద్ధి పనులు
- ఈ 31న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మంత్రి కేటీఆర్
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- మంత్రితో పాటు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తదితర అధికారులు


వరంగల్ : కనీవినీ ఎరుగని రీతిలో కమలాపూర్ అభివృద్ధి జరుగుతున్నది. ప్రజలు ఊహించని విధంగా ఒకే రోజు 49 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ఈ నెల 31న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందనడానికి ఇది నిదర్శనం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ లో రూ.49 కోట్లతో పలు అభివృద్ధి పనుల కు కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని మంత్రి తెలిపారు. 


హెలిప్యాడ్ సహా, మంగళవారం కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ఆయా అభివృద్ధి పనులను మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. అలాగే, కేటీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వీలుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఆదేశించారు.  


ఇవీ అభివృద్ధి పనులు
కోటి 50 లక్షల రూపాయలతో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపనలు చేయనున్నారు. కోటి 71 లక్షల రూపాయలతో ఆర్టీసీ బస్ స్టాండ్ కు, 25 లక్షలతో sc కమ్యూనిటీ హాలు, 25 లక్షలతో అయ్యప్ప గుడి, 30 లక్షలతో పెద్దమ్మ గుడి, 50 లక్షలతో గౌడ సంఘం కమ్యూనిటీ హాలు, 30 లక్షల రూపాయలతో మార్కండేయ గుడి లకు శంకుస్థాపనలు చేయనున్నారు మంత్రి కేటీఆర్. అలాగే, 69 లక్షల 85 వేలతో 10 వివిధ కుల సంఘాల భవనాల సముదాయానికి, 19 కోట్లతో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాల, 20 కోట్లతో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలికల, 2 కోట్లతో కస్తూర్బా, 2 కోట్ల 50 లక్షలతో ప్రభుత్వ జూనియర్ కాలేజి భావనలకు కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. మొత్తం 49 కోట్లతో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.


పార్టీ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ 
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటలకు పార్టీ ఎంపీలు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. లంచ్ చేసిన అనంతరం పార్టీ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులను కేసీఆర్.. మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. భోజనం అనంతరం సమావేశం ప్రారంభమైంది. జాతీయ పార్టీగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ అనుసరించాల్సి వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పోరాడుతూనే దేశ వ్యాప్త అంశాలపై కూడా స్పందించే విధంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్‌లో కేటాయింపులు, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు కీలకంగా మారనున్నాయి.