మానవత్వం మరిచి ప్రయాణికుడిని కాలుతో తన్నిన కండక్టర్
టికెట్ అడిగిన పాపానికి యువకుడిపై కండక్టర్ ఆగ్రహం
మతిస్థిమితం లేని యువకుడిపై రెచ్చిపోయిన టీఎస్ఆర్టీసీ కండక్టర్
వరంగల్ జిల్లా సంగెం పరిధిలో ఘటన
ఆ కండక్టర్‌పై తోటి ప్రయాణికులు, నెటిజన్లు ఆగ్రహం
Conductor Attacks TS RTC Passenger: వరంగల్ : ఆర్టీసీ బస్సు ఎక్కగానే కనిపించే విషయం ఈ బస్సు మనది మన అందరిదీ. కానీ ఓ కండక్టర్ ప్రవర్తన చూస్తే ఆర్టీసీ బస్సు అతడి సొంత వాహనం అని అనుమానం వస్తుంది. ఆర్టీసీ బస్సు తన సొంతం అన్నట్లుగా ప్రయాణికుడితో మానవత్వం మరిచిన కండక్టర్ ప్రవర్తించిన తీరు పై ప్రయాణికులతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతిస్థిమితం లేని యువకుడిని కాలుతో తన్నడం కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
ఎల్గుర్ రంగంపేటకు చెందిన దేవదాసు అనే ప్రయాణికుడు వరంగల్ నుండి చండ్రుగొండకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. వరంగల్ నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు అతడు. అందరు ప్రయాణికుల్లాగ దేవదాసు కండక్టర్ కు టికెట్ కోస డబ్బులు ఇచ్చాడు. ముందుగా టిక్కెట్ డబ్బులు ఇచ్చినా, తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో కండక్టర్ ను టిక్కెట్ ఇవ్వాలని ప్రయాణికుడు అడిగాడు. దాంతో ఆవేశానికి లోనైన కండక్టర్ ఆ ప్రయాణికుడిని కాలితో తన్నాడు. మతిస్థిమితం లేని యువకుడిని కండక్టర్ కాలుతో తన్నిన ఘటన వరంగల్ ఆర్టీసీలో కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఈ ఘటన జరిగింది. టికెట్ ఇవ్వమని అడిగితే దౌర్జన్యం చేయడం ఏంటని తోటి ప్రయాణికులు కండక్టర్ ను నిలదీశారు. ప్రయాణికులపై ఇలా దాడులు చేయడం, కాలితో తన్నుతూ వారిని అవమానిస్తున్న కండక్టర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఎండీని, ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.