Rains in Telangana AP: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ఏపీ, తెలంగాణలో తగ్గుముఖం పట్టాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం తగ్గడంతో వర్ష ప్రభావం అంతగా లేదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అక్టోబర్ 22న ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని ఎల్లో వార్నింగ్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. రెండు రోజుల తరువాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాలు త్వరలో ఏపీలోకి ప్రవేశించనున్నాయి. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు సాధారణ వర్షపాతం నమోదు కానుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి. అయితే భారీ వర్షాలు కానందున ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. నగరంలో, జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో నేడు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. సూచనతో ఉత్తరాంధ్ర జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. పశ్చిమ గోదావరి, కొనసీమ కోస్తా ప్రదేశాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. కొన్ని చోట్లల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడ పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అనకాపల్లి పెందుర్తి, వైజాగ్ చుట్టుపక్కనే ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉంటాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అక్టోబర్ 20న బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడుతుందని దాని ప్రభావంతో అక్టోబర్ 22న తుఫాను ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయి. రాయలసీమ జల్లాల్లోని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వర్షాలు పడతాయి. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.