Revanth Reddy: సోమవారం రోజు అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ యూత్ లీడర్ పవన్‌ను తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమ పార్టీ విద్యార్థి నాయకుడు పవన్ పై జరిగిన కమిషనర్ కు పిర్యాదు చేశామన్నారు రేవంత్. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కావాలని కుట్ర పూరితంగానే పవన్ పై దాడి చేయించారని ఆరోపించారు. ఇదే విషయాన్ని పోలీసులకు వివరించినట్లు స్పష్టం చేశారు. దాడికి కుట్ర పన్నిన ఎమ్మెల్యే వినయ భాస్కర్, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరినట్లు వెల్లడించారు. రక్త నమూనాలు సేకరించి డ్రగ్స్ టెస్ట్ చేయాలని కోరినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గంజాయి బానిసలను ముఠాలుగా చేసి బీఆరెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని కమిషనర్ కు వివరించినట్లు ఆయన తెలిపారు. హత్యా నేరం కింద కేసు నమోదు చేసి కొంత మందిని అదుపులోకి తీసుకున్నామని కమిషనర్ చెప్పినట్లు వెల్లడించారు. మరి కొంత మందిని అరెస్ట్ చేస్తామన్నారని వివరించారు.
దాడులకు పాల్పడింది ఎంత పెద్ద వారైనా వదిలి పెట్టేది లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. సీసీ టీవీ ఫుటేజీలో ఉన్నవారి మొబైల్స్ సీజ్ చేసి విచారించాలని తాము డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. సభలపై దాడులు చేసి సభలు జరగకుండా చేయాలని కేసీర్ అనుకుంటే... రేపటి నుంచి కేసీఆర్ ఏ ఊర్లో ఒక్క సభ కూడా జరపలేరని అన్నారు. మా మౌనాన్ని చేత కానితనంగా భావించొద్దన్నారు. మా సంయమనాన్ని పరీక్షిస్తే కాంగ్రెస్ చూస్తూ.. ఊరుకోదని తెలిపారు. కాంగ్రెస్ తలుచుకుంటే స్థానికంగా తిరగలేమని దయాకర్ , శంకర్ నాయక్ వ్యాఖ్యలు దాడులకు ప్రేరణగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. దాడులే ప్రాతిపదికగా రాజకీయం చేద్దామంటే.. తేదీ, స్థలం ప్రకటించండని రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ అయినా, వరంగల్ హంటర్ రోడ్డు అయినా ఎక్కడైనా తాము సిద్ధమేనని సవాల్ విసిరారు.
దాడికి నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చెయ్యండి..
యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ పై దాడిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఏకశిల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తోట పవన్ ను ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు అరాచక శక్తులుగా మారారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గూండాల పాలన సాగుతోందన్న ఆయన.. ఎమ్మెల్యే ఆదేశాలతోనే తనపై దాడి జరిగినట్టు పవన్ చెప్పాడన్నారు. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై కేసు ఫైల్ చేయాలన్నారు. అతని ముఠా సభ్యులను జైళ్లో వేయాల్సిన పోలీసులు కూడా రాజకీయ ఒత్తిడి వల్ల, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిందితులను కాపాడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ ఘటనపై డీజీపీ స్పందించాలని, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, సీఎం దిష్టిబొమ్మలు దహనం చేయడంటూ పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రగా కమిషనరేట్ కు బయలుదేరారు.