Warangal News: హన్మకొండ జిల్లాకేంద్రంలో హై టెన్షన్ నెలకొంది. సోమవారం రోజు రాత్రి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ ముగియగానే.. యూత్ కాంగ్రెస్ నాయకుడు పలన్ పై హత్యాయత్నం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పవన్ ను ఓ గల్లీలోకి తీసుకెళ్లి విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ పవన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. విషయం గుర్తించిన స్థానికులు పవన్ ను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలోనే నిందితులను గుర్తించారు. 


స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ బాస్కర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పవన్ పై బీఆర్ఎస్ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రస్తుతం పవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యకర్తలతో ముచ్చటిస్తారు. ఆపై మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు పెద్దమ్మగడ్డ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. సాయంత్రం 7 గంటలకు వరంగల్ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రేవంత్ పాదయాత్రకు కొండా మురళీ, సురేఖ దంపతులు భారీ ఏర్పాట్లు చేశారు. 


పాదయాత్రలతో క్షేత్ర స్థాయి క్యాడర్‌లో కదలిక !


కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పేరుతో పాదయాత్రలు చేయాలని ఏఐసీసీ అదేశాలు ఇచ్చింది. ఈ పాదయాత్ర రేవంత్ రెడ్డి చేస్తారన్న విషయంపై వివాదం ప్రారంభమయింది. అయితే సీనియర్లందరికీ కొన్ని నియోజకవర్గాలు పంచిన థాక్రే.. పాదయాత్రలు చేయాలని సూచించారు.  దీంతో తెలంగాణలో కూడా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 6 నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. నాయకులందరూ ఎవరికి వారుగా తమ, తమ నియోజక వర్గాల్లో పాదయాత్రలు చేయాలని, టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమమార్క, ఇతర సీనియర్లు రాష్ట్రంలో ఏదో ఒక చోట యాత్రల్లో పాల్గొనేలా రాజీ చేశారు. దీంతో సీనియర్లు పాదయాత్రలు ప్రారంభింంచారు. 



రేవంత్ రెడ్డికి క్రమంగా పెరుగుతున్న సీనియర్ల మద్దతు !


టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పేరుతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు నుంచి పాదయాత్రకు శ్రీకారకం చుట్టి..రెండు నెలల పాటు జనంలో ఉండే విధంగా ప్లాన్‌ చేసుకుని ముందుకు సాగుతున్నారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఇతర సీనియర్లు కూడా హాజరై సంఘీభావం చెప్పారు. సీనియర్ నేతల్లో మార్పు రావడంతో పాటు పార్టీ కేడర్‌లో కూడా నూతన జోష్‌ వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల ముం దు కు బలంగా తీసుకెళ్లితే తమకు అధికారం రావడం ఖాయమని.. ముందు  పార్టీ గెలిస్తే..తర్వాత ప్రాధాన్యతలు.. పదవుల గురించి ఆలోచించవచ్చని అనుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఈ మార్పు ఆ పార్టీ క్యాడర్‌ను సంతృప్తి  పరుస్తోంది.