వరంగల్: ములుగు ఏజెన్సీలో మరోసారి పోలీసులు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో గిరిజనులు నిర్మించుకున్న ఆవాసాలను కూల్చేందుకు వచ్చిన అటవీ, పోలీసు శాఖ సిబ్బంది వెళ్లగా.. వారిని కర్రలతో తరిమారు గిరిజనులు. తమకు ఇళ్లపై హక్కులు కల్పించాలని మంత్రి సీతక్కను ఆదివాసీలు కోరుతున్నారు.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామ పంచాయతీ అటవిశాఖ పరిధిలో గుడిసెలు నిర్మించుకుని గిరిజనులు నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం ఉదయం ఆదివాసీల గుడిసెలను జేసీబీ, బుల్డోజర్ల సహాయంతో అటవీ, పోలీసు శాఖా అధికారులు కూల్చే ప్రయత్నం చేయగా.. కర్రలతో గిరిజనులు వారిని తరిమారు. తమ నివాసాలను కూల్చేయడం ఏంటని ప్రశ్నిస్తూ వారు ఎదరుతిగరడంతో చేసేదేం లేక అధికారులు వెనక్కి మళ్లారు. అయితే ఈ పరిస్థితిని ఇంకెంత కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి సీతక్క జిల్లాలో, నియోజక వర్గంలో రోజుకో చోట గిరిజనుల భూముల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల రాయిబంధం గూడెంలో సోడి రమేష్ అనే రైతు భూమిలో మొక్కలు నాటాడినికి వెళ్ళిన అటవీశాఖ అధికారులను వేడుకొన్నా వినకపోవడంతో  మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది మరవక ముందే మరో చోట గిరిజనుల గుడిసెలను తొలగించే ప్రయత్నం చేయడంతో అధికారులు, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండ్లు లేని నిరపేద గిరిజనులు గత రెండేళ్ళుగా రొయ్యూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసముంటున్నారు. కానీ అటవీశాఖా అధికారులు పోలీసు ప్రొటెక్షన్ తో వచ్చి తమకు ఆవాసం లేకుండా చేయాలని ప్రయత్నించడాన్ని  గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు.

తాము కేవలం గుంట, రెండు గుంటలలో ఆవాసం ఏర్పాటు చేసుకోగా.. ఛత్తీస్‌గఢ్ నుండి వలస వచ్చిన గుత్తికోయల మాదిరిగా ఎకరాలలో పోడు చేసుకోలేదని స్థానిక గిరిజనులు మంత్రి సీతక్కను ప్రశ్నిస్తున్నారు. తమపై అటవీశాఖ అధికారులు దాడులు ఆపాలని, లేకపోతే  ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మంత్రి సీతక్క ఇకనైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.