Telngana Lok Sabha Elections 2024: మావోయిస్టుల ఇలాకాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ హెచ్చరికలను లెక్కచేయకుండా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ఓటింగ్ సరళి సజావుగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండి 4 గంటల వరకు సాగిన పోలింగ్ ప్రక్రియలో ఏజెన్సీ ప్రాంత వాసులు తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకున్నారు. వరంగల్, జనగాం లో చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. కానీ ఏజెన్సీ ప్రాంతంలో చిన్న వివాదానికి తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


మావోయిస్టుల హెచ్చరికలను లెక్కచేయకుండా పోలింగ్ లో పాల్గొన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం ఎన్నికలు బహిష్కరించాలనే హెచ్చరికలతో రాష్ట్ర పోలీసుల తోపాటు కేంద్ర బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకోవడంలో 65 శాతం పోలింగ్ నమోదైంది.


ఇక మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలు తప్ప మిగితా ఐదు అసెంబ్లీకి నియోజకవర్గాలు భద్రాద్రి కొత్తగూడెం, పినపాక, ఇల్లంద, ములుగు, నర్సంపేట పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లా ఎస్పీ ల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టుల హెచ్చరికలతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలను ఎన్నికలను బహిష్కరించాలనే హెచ్చరికలను లెక్కచేయకుండా గిరిజనులు కిలోమీటర్ల మేర కాలీ నడకన వచ్చి ఓటు వేశారు. ములుగు నియోజకవర్గంలో 67.92 శాతం, పినపాక నియోజకవర్గంలో 65.91శాతం, ఇల్లందు నియోజకవర్గంలో 69.11 శాతం, భద్రాచలం నియోజకవర్గంలో 64.72 శాతం పోలింగ్ నమోదైంది.


మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా జరగడంతో పాటు అధిక శాతం పోలింగ్ నమోదు కావడంతో పోలీస్ ఊపిరి పీల్చుకున్నారు. భద్రాచలం, ములుగు సరిహద్దు ప్రాంతం చత్తీస్గడ్, మహారాష్ట్ర లో రెండు నెలలుగా వరుస ఎన్ కౌంటర్ లలో మావోయిస్టులు పదుల సంఖ్యలో మృతి చెందారు. మావోల నుండి ప్రతీకార చర్యల నేపత్యంతోపాటు మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని హెచ్చరించడంతో ఈ క్షణంలో ఏం జరుగుతుందోనని పోలీసులు ఆందోళనకు గురయ్యారు. కానీ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపించుకున్నారు.