Telangana SSC Hindi Paper Leak: తెలంగాణలో పదో తరగతి పరీక్షల రెండో రోజు కూడా ప్రశ్నపత్రం లీక్ అయింది. నేడు హిందీ పరీక్ష జరుగుతుండగా, పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే హిందీ పేపర్ బయటికి వచ్చింది. దీన్ని వాట్సప్ గ్రూపులో కొందరు షేర్ చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో ఈ పేపర్ లీక్ జరిగింది. వరుసగా రెండో రోజు కూడా పదో తరగతి పరీక్షా పత్రం లీక్ కావడం సంచలనంగా మారింది.  SSC స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ఈ హిందీ ప్రశ్న పత్రం ప్రత్యక్షం అయినట్లుగా తెలుస్తోంది.


ఈ క్వశ్చన్ పేపర్ ఉదయం 9.30కే లీక్ అయినట్లుగా తెలుస్తోంది. వరుసగా రెండో రోజు ప్రశ్న పత్రం లీక్ అవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హిందీ ప్రశ్నపత్రం బయటకు ఎలా వెళ్లిందనే విషయంపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.


మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా


హిందీ క్వశ్చన్ పేపర్ వాట్సాప్‌లో వైరల్‌ కావడంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. వరంగల్‌, హనుమకొండ డీఈవోలతో ఆమె మాట్లాడారు. దీనిపై వరంగల్‌ సీపీకి ఫిర్యాదు చేయాలని మంత్రి సబిత ఆదేశించారు. దీంతో ఫిర్యాదు ఇవ్వడానికి సీపీ కార్యాలయానికి డీఈవోలు వెళ్లారు. 


నిన్న (ఏప్రిల్ 3) వికారాబాద్‌లో తెలుగు పేపర్ లీక్


వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠ‌శాల‌-1లో సోమ‌వారం ఉద‌యం తెలుగు ప్రశ్నాప‌త్రం బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 4న జరిగే ప‌రీక్ష వాయిదా వేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ క‌థ‌నాల‌పై రాష్ట్ర పాఠ‌శాల విద్యాశాఖ స్పందించింది. ఏప్రిల్ 4న జరుగనున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష వాయిదా ప‌డ‌లేద‌ని పాఠ‌శాల విద్యాశాఖ స్పష్టం చేసింది. 


అసలే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీల విషయంలో రాజకీయంగా రచ్చ జరుగుతున్న సమయంలో టెన్త్ పేపర్ లీకేజీ తలనొప్పిగా మారింది. వెంటనే అధికారులు స్పందించారు. తాండూరులోని ప్రభుత్వ నెంబర్(1) పాఠశాలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయుడు బందెప్ప పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రంను వాట్సాప్ లో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. బందెప్పకు పైన పేర్కొన్న ప్రభుత్వ పాఠశాలలో ఇన్విజిలేటర్  గా విధుల్లో ఉన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సీరియస్ అయ్యారు. జరిగిన ఘటనపై పోలీసు శాఖతో పాటు విద్యాశాఖ విచారణ ప్రారంభించింది. బయటకు లీక్ చేసిన బందెప్పతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరో ఇద్దర్ని కూడా సస్పెండ్ చేశారు.


ప్రశ్నాపత్రాలు ఉదయం 9 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పాఠశాలకు భద్రత మధ్య తీసుకవస్తారు. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల్లో విడదీస్తారు. అనంతరం 9 గంటల 30 నిమిషాలకు పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు అందజేస్తారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లను అనుమతించరు.   ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్ప తన సెల్ ఫోన్ ను ఎలా పరీక్ష కేంద్రంలోకి తీసుకువెళ్లారు. దీనికి పై అధికారుల  నిర్లక్ష్యమే కారణమని గుర్తించారు.   తెలుగు ప్రశ్నాపత్రంను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన బందెప్పను పోలీసులు అందుపులోకి తీసుకున్నారు.