వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న జరిగే పరీక్ష వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పందించింది. ఏప్రిల్ 4న జరుగనున్న పదోతరగతి పరీక్ష వాయిదా పడలేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఏప్రిల్ 4 నుంచి 13 వరకు అన్ని పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇక తెలుగు ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా బయటకు పంపిన వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు.
ప్రశ్నాపత్రాన్ని బయటకు పంపిన ఉపాధ్యాయుడు బందప్ప, మరో ఇన్విజిలేటర్ సమ్మప్ప, చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ గోపాల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్లు శ్రీ దేవసేన తెలిపారు.
ఇన్విజిలేటర్లపై ప్రత్యేక దృష్టి..
పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే లీకేజ్ ఘటన కలకలం రేపిన నేపథ్యంలో మిగతా ఐదు రోజుల పాటు నిర్వహించనున్న పరీక్షలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఛీఫ్ సూపరింటెండెంట్ సహా డిపార్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు వాడకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ మొదటి పరీక్ష రోజు ఇన్విలేజర్ పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకువెళ్లిన నేపథ్యంలో పరీక్షా కేంద్రాలలోకి అనుమతి వెళ్లే ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా పరీక్షించాలని పోలీసు అధికారులు, కలెక్టర్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాలలో ఛీఫ్ సూపరింటెండెంట్ ప్రశ్నాపత్రాల సీల్‌ను తెరిచిన తర్వాత కవర్‌లలో డిపార్మెంటల్ అధికారులు ఇన్విజిలేటర్లకు ప్రశ్నాపత్రం అందజేయనున్నారు. ఈ మేరకు అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకోవాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలలో అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్య సమన్వయ లోపం కారణంగా పేపర్ లీకేజి వంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్షల విధులు నిర్వహించే అందరూ సమన్వయంతో పనిచేసేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
సెల్‌ఫోన్లపై నిషేధం ఉన్నా..!
టెన్త్ పరీక్షల విధుల్లో ఉన్నవారు సెల్‌ఫోన్లు వినియోగించరాదని, ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు ముందే హెచ్చరించారు. నిరుడు కూ డా పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించలేదు. పరీక్షల విధుల్లో ఉన్న టీచర్ బందెప్ప నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్‌ను పరీక్షాకేంద్రం లోపలికి తీసుకెళ్లి ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి ఇన్విజిలేటర్ సమ్మప్పకు పంపించాడు. ఇదే విషయంపై సోమవారం శ్రీదేవసేన డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Also Read:
ఏప్రిల్ 20 నుంచి 'సమ్మెటివ్-2' పరీక్షలు, షెడ్యూలు ఇదే!
ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 20 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ ఇటీవల విడుదల చేశారు. ఏప్రిల్ 20 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!
తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన' కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 8వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఏప్రిల్ 10న సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..