Guvvala Balaraju: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా.. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు మాత్రం జోరుగా సాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఉన్న టీఆర్ఎస్ నేత అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సహా మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంకా బయటకు రావడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా అచ్చంపేట నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. "అచ్చంపేట ఆత్మగౌరవాన్ని రూ. 100 కోట్లకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అమ్ముకున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్లారా, యువకుల్లారా, మేధావుల్లారా, విద్యావంతుల్లారా ఒక్కసారి ఆలోచించండి. ఎటుపోతుంది మన అచ్చంపేట ఆత్మగౌరవం. ఎమ్మెల్యే బాలరాజును అచ్చంపేట పొలిమేర దాటే వరకు తరిమికొడదాం.. మన అచ్చంపేట ఆత్మగారవాన్ని కాపాడుకుందాం" అంటూ పోస్టర్లలో రాశారు. 


వివిధ ఘటనలు ఫోటోలతో పోస్టర్లు


నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో ఈ పోస్టర్లు కనిపించాయి. ఈ పోస్టర్లలో.. నియోజకవర్గంలో పలు సందర్భాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన ఫోటోలను పొందుపరిచారు. వికలాంగుడు శ్రీనుపై దాడి, గిరిజన సర్పంచ్ పై దాడి, ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన కార్యకర్తలపై రాళ్ల దాడి ఘటనలకు సంబంధించిన ఫోటోలను ఉంచారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 


ప్రత్యర్థుల కుట్ర అంటున్న టీఆర్ఎస్


ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలా పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారని స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఈ పోస్టర్లు ప్రత్యర్థుల కుట్ర అని అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగు చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ నలుగురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచింది. వారికి ఎలాంటి హానీ జరగకుండా 24 గంటలు భద్రత కల్పిస్తోంది. 4+4 గన్ మెన్ లు నిత్యం రక్షణ కల్పిస్తున్నారు. 


ఎమ్మెల్యేలను ప్రశ్నించేదెప్పుడు?


ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు ముందుకు సాగుతోంది. ముగ్గురు నిందితుల రెండు రోజుల కస్టడీ కూడా పూర్తయింది. రెండు రోజుల్లో తెలుసుకోగలిగినంత సమాచారం తెలుసుకున్నారు. కానీై వాట్ నెక్ట్స్ అన్నది మాత్రం ఇప్పటికీ అస్పష్టతగానే ఉంది. కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. 23 మంది ముఠా ఉందని అందరికీ తెలిసింది. వీళ్లెవరు ? ఎక్కడెక్కడ ఉంటారు ? వారందర్నీ ఎలా పట్టుకొస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కేసులో ముందుగానే విడుదల చేసిన సాక్ష్యాలు ఎంత వరకూ చెల్లుబాటనే సందేహం ఉండనే ఉంది. ఈ క్రమంలో అన్నీ వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఆ నలుగురు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తారా లేదా అన్న చర్చ నడుస్తోంది.


ఫామ్‌హౌస్ డీల్‌ బయటపడినప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. అంతకు ముందే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే ట్రాప్ చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ.. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి.. ఆడియో, వీడియోల్లో ఉన్న మాటల మర్మాన్ని తెలుసుకోవడానికి పోలీసులు నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు ప్రశ్నించడం లేదనేది ఎక్కువగా విపక్షాలు సంధిస్తున్న ప్రశ్న. ఆ నలుగురు ఫిర్యాదు దారులైనా సరే వారి దగ్గర్నుంచి వాంగ్మూలం తీుకోవాలి కదా అని అడుగుతున్నారు. కానీ పోలీసులు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. నిందితులను రెండు రోజుల కస్టడీకి తీసుకుని వాయిస్ శాంపిల్స్ తీసుకుని.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి మళ్లీ రిమాండ్‌కు పంపేశారు.