Konda Surekha and Seethakka News: తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, మరో మంత్రి సీతక్క వరంగల్‌లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు. హన్మకొండ హంటర్ రోడ్ లోని ఓ ఫంక్షన్ హాల్ మంత్రులు కొండా సురేఖ, సీతక్కల ఆప్యాయత అనురాగాలకు వేదికగా నిలిచింది. ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఇద్దరు మంత్రులు ఒకరినొకరు పలకరించుకొని పక్కపక్కనే కూర్చొని నవ్వులు చిందించారు. ఇద్దరు మహిళా మంత్రుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయన్న నేపథ్యంలో వీరి నవ్వులు కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యానికి గురిచేశాయి. రెండు రోజుల క్రితం సీతక్క, కొండ సురేఖ ల మధ్య విబేధాలకు తావులేదని కొండ సురేఖ పత్రిక ప్రకటనను విడుదల చేశారు.


విభేదాలంటూ వార్తలు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొండా సురేఖ అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సీతక్క పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే, వీరు ఇద్దరి మధ్యా ఆధిపత్య పోరు మొదలైందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అనుకూల మీడియాలో వీరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయని... పైచేయి సాధించేందుకు ఇద్దరూ పోటాపోటీగా ఉంటున్నారని ఆ కథనాల్లో రాశారు. గత ఫిబ్రవరి సమయంలో జరిగిన మేడారం జాతర సమయంలో వీరు ఇద్దరి మధ్య పంచాయితీ మొదలైందని.. కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల వేళ విభేదాలు తీవ్రస్థాయికి చేరాయని ప్రచారం జరిగింది.


కొద్ది రోజుల క్రితమే స్పందన
అయితే, ఇలా ఓ మీడియా సంస్థ రాసిన కథనం పట్ల సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ కూడా దీనిపై మండిపడ్డారు. తమ మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలను సంయుక్తంగా ఖండించారు. తమ ప్రభుత్వంలో ఎవరితోనూ ఏ విభేదాలు లేవని, అందరం పరస్పర అవగాహనతో కలిసి ఉన్నామని తెలిపారు. ఇద్దరు మహిళా మంత్రుల మధ్య విభేదాలు అంటూ వచ్చిన వార్తలు అబద్ధాలని కొట్టిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా డెవలప్ మెండ్ కోసం, రాష్ట్రం కోసం ఇద్దరం కలిసి పని చేస్తామని తేల్చి చెప్పారు. మీడియా బాధ్యతాయుతంగా, జవాబుదారీగా వ్యవహరించాలి మంత్రులు సీతక్క, సురేఖ సూచించారు.