టూరిస్టులుగా రాష్ట్రానికి వ‌స్తున్న ఫ్ల‌వ‌రిస్టులు అవ‌గాహ‌న లేమితో ఫూలిష్‌గా మాట్లాడ‌టం మానుకోవాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఈ మ‌ధ్య వ‌ల‌స ప‌క్షుల్లా రాష్ట్రానికి వ‌ర‌స‌గా వ‌స్తున్న కొందరు బిజెపి నేత‌లు, ఇత‌ర రాష్ట్రాల సీఎంలు త‌మ ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని మంత్రి విమ‌ర్శించారు. స్థానిక బిజెపి నేత‌లు ఇచ్చిన ప్రాంప్టింగ్‌ని తూ.చ‌. త‌ప్ప‌కుండా అప్పగిస్తున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి జాతీయ అధ్య‌క్షుడుగానీ, కేంద్ర మంత్రులుగానీ, వ‌రంగ‌ల్ కి వ‌చ్చిన అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ మాట‌లు గానీ చూస్తే, వారి తెలివి బ‌య‌ట ప‌డుతుంద‌న్నారు.  


మీరు సీఎంగా సామాన్య‌ ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌డానికి ప్ర‌త్యేకంగా స‌మ‌యం ఇస్తారేమో కానీ మా సీఎం సామాన్య ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఉంటారని.. ఈ విష‌యం తెలుసా? అని అసోం సీఎంని మంత్రి ఎర్రబెల్లి ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో ఇప్ప‌టికే ల‌క్షా 32వేల ఉద్యోగాలిచ్చామని ఎప్పటికప్పుడు ఖాళీలు నింపుతున్నట్టు చెప్పారు. మ‌రి బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇంకా ప్ర‌ణాళిక‌ల ద‌గ్గ‌రే ఉన్నారని గుర్తు చేశారు. దేశంలో ప్ర‌తి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలేమ‌య్యాయి? చెప్ప‌గ‌ల‌రా? 2014లో ఇచ్చిన ఆ హామీ ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు 16 కోట్ల ఉద్యోగాలివ్వాలి? అవేమ‌య్యాయి?  ఉద్యోగాల క‌ల్ప‌న‌లో విఫ‌ల‌మైంది ఎవ‌రు? మీరా? మేమా? అని అస్సాం ముఖ్య‌మంత్రిని మంత్రి ఎర్ర‌బెల్లి సూటిగా ప్ర‌శ్నించారు. 


దేశంలో ఎక్క‌డైనా తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయా? మీ హ‌యాంలో దేశంలో ఎక్క‌డైనా కాళేశ్వ‌రం వంటి ప్రాజెక్టుని క‌ట్టారా? రైతుల‌కు రైతు బంధు, రైతు బీమా వంటి ప‌థ‌కాలు మీ రాష్ట్రాల్లో ఎక్క‌డైనా ఉన్నాయా? రైతు బంధు ప‌థ‌కాన్ని కాపీ కొట్టి కిసాన్ స‌మ్మాన్ ప‌థ‌కం అమ‌లు చేస్తున్న‌దెవ‌రు?  మీ జ‌ల్ శ‌క్తి మిష‌న్ ప‌థ‌కం, మా మిష‌న్ భ‌గీర‌థ‌కు కాపీ కాదా? ఒక‌వైపు మా ప‌థ‌కాల‌ను కాపీ కొడ‌తారు. నిండు పార్ల‌మెంటులోనే అభినందించి అవార్డులు, రివార్డులు ఇస్తారు. ఇక్క‌డ‌కు వ‌చ్చి  మీరేం చేశార‌ని ప్ర‌శ్నిస్తారా? ఇదేనా మీ బిజెపి సంస్కృతి? అంటూ మంత్రి ఎర్ర‌బెల్లి బిజెపి నేత‌ల వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. 
  
సీఎం కెసిఆర్ దార్శనికత వల్ల తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. బిజెపి నేత‌లు స‌హా, ఎవ‌రైనా తెలంగాణ రాష్ట్రానికి రావొచ్చు. పోవ‌చ్చు. మీటింగులు పెట్టుకోవ‌చ్చు కానీ, సీఎం కెసిఆర్ మీద మాట్లాడ‌టానికి సాహ‌సించ‌వ‌ద్దని సూచించారు మంత్రి దయాకర్. బీజేపీ పాలిత రాష్ట్రాలు, దేశంలోని వివిధ పథకాలు, తెలంగాణ రాష్ట్రంలోని ప‌థ‌కాలు, వాటి అమ‌లు తీరుపై, అభివృద్ధి, సంక్షేమాల‌పై ఎలాంటి చ‌ర్చ‌కైనా సిద్ధ‌మేన‌ని స‌వాల్ విసిరారు ఎర్రబెల్లి.
Also Read: చిన జీయర్ స్వామి వద్దకు సీఎం కేసీఆర్.. యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణపై చర్చ, రామానుజుల విగ్రహ పరిశీలన


Also Read: టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గోరి కడతారు... ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు... హన్మకొండ సభలో బీజేపీ నేతలు


Also Read: ఖమ్మం కాంగ్రెస్‌లో అసలేంటి ఈ పరిస్థితి! తర్జనభర్జనలు పడుతున్న రాష్ట్ర నాయకత్వం


Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...! 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి