వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పడడంలో ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములను సేకరించాలనే ప్రభుత్వం తొలుత తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ప్రభుత్వమే వెనక్కి తీసుకుంది. ఓఆర్‌ఆర్‌ నిర్మాణం కోసం రైతుల నుంచి వ్యవసాయ భూములు తీసుకోవాల్సి ఉంది. 41 కిలో మీటర్ల వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని 28 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించాల్సి ఉంది. ఇందుకోసం రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో భూములు తీసుకోవాలని కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (KUDA) గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత సర్వే పనులు కూడా మొదలయ్యాయి. అయితే ల్యాండ్‌ పూలింగ్‌కు భూ యజమానుల సమ్మతి కోసం తెచ్చిన జీఓ 80ఏ ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మూడు జిల్లాల పరిధిలో గత 5 నెలలుగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.


రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత
సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నీరు అందుబాటులోకి రావడంతో ఇప్పటికే భూముల ధరలు అక్కడ భారీగా పెరిగాయి. దాంతో, తమ భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. దీంతో భూముల సమీకరణ వివాదాస్పదంగా మారింది. ఇక్కడి భూములకు ఎకరానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ ధర పలుకుతోందని, చక్కగా మూడు పంటలు పండే సారవంతమైన భూములని రైతులు అంటున్నారు. అలాంటి వీటిని ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు నిరసనల్లో చెబుతున్నారు. 


వరంగల్‌ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తున్నారని తెలిసి ఆ నిర్మాణానికి సమీపంలో ఎమ్మెల్యేలు, వారి బినామీలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని రైతులు ఆరోపించారు. వాటి విలువ పెంచుకోవడం కోసమే ఇప్పుడు ల్యాండ్‌ పూలింగ్‌ను తెరపైకి తెచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట రైతులు ఆందోళన బాట పట్టగా ల్యాండ్‌ పూలింగ్‌ నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ‘కుడా’ వైస్‌ చైర్మన్‌ పి.ప్రావీణ్య భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.


 అయినా ఆందోళనలు ఆగలేదు. రైతులు రోడ్లను దిగ్బంధనం చేశారు. నిరసనలు మరింత పెరుగుతుండడంతో సోమవారం ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని ఆపేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు అర్వింద్‌ కుమార్‌ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.