Rahul Gandhi In Warangal: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party) అధికారంలోకి రాగానే కుల గణన (Caste Census) చేడతామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. వరంగల్‌ (Warangal)  రుద్రమదేవి కూడలిలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగసభ (Public Meeting)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను (Six Guarantees) కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు.  ఎక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ రాష్ట్రంలో ప్రతి పైసా పేదలకే వెళ్తుందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. 


తొలి కేబినెట్‌లోనే ఆరు గ్యారెంటీలకు ఆమోదం
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల బ్యాంకు ఖాతాలో ప్రతి నెల రూ.2,500 వేస్తామని. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. విద్యార్థుల చదువు, కోచింగ్‌ కోసం యువ వికాసం కింద రూ.5 లక్షలు ఇస్తామని, చేయూత పథకం కింద వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల రూ.4 వేలు ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై తొలి మంత్రివర్గంలోనే నిర్ణయం తీసుకొని సంతకాలు పెట్టిస్తామని వివరించారు. 


బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం కొందరి కేసమే పని చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ తన మిత్రుడు అదానీకి లబ్ధి చేకూరేలా పని చేస్తుంటే, సీఎం కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులకు లాభం చేకూరుస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వలేదని విమర్శించారు. దళితులు, మైనారిటీలు, అణగారిన వర్గాలు లాభపడతాయని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపిందన్నారు.


కులగణన చేపడతాం
రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే న్యాయం జరుగుతోందని విమర్శించారు. తెలంగాణాలో ముఖ్యంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక  కులగణన చేపడతామని చెప్పారు. ఏఏ కులాలు వెనకబాటుకు గురయ్యాయో తెలుసుకొని అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు


విభజించి పాలించడమే వాటి లక్ష్యం
దేశంలోని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు రాహుల్ చెప్పారు.  కన్యాకుమారి మొదలుకొని కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేశానని, ఆ సమయంలో ఆర్‌ఎస్ఎస్, బీజేపీ ప్రజలను ఏ విధంగా విభజించి పాలిస్తున్నాయో అర్థమైందన్నారు. ఇండియా ప్రేమ, త్యాగం, పోరాటాలకు నిలయమని, విద్వేషాలు రగిలించే దేశం కాదన్నారు. కానీ బీఆర్ఎస్, బీజేపీ దేశాన్ని, ప్రజలను విభజించు పాలించి సూత్రాన్ని అమలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. 


బీఆర్ఎస్ కోసం బీజేపీ పని చేస్తోంది
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, ఒకరు ఢిల్లీలో పనిచేస్తే, మరొకరు తెలంగాణలో పనిచేస్తున్నారని, అవసరానికి రెండు పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ నాయకులు కొన్నాళ్లు హడావిడి చేశారని, ఇప్పుడు ఎండుకు చప్పుడు చేయడం లేదని ప్రశ్నించారు. రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని తెలంగాణలో బీఆర్ఎస్‌ను గెలిపించడానికి బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు. లోక్‌సభలోనూ ఈ రెండు పార్టీలు కలిసిమెలిసి ఉన్న విషయాన్ని తాను గమనించానని చెప్పారు. 


వారిని గద్దె దించడమే లక్ష్యం
బీజేపీ ప్రవేశ పెట్టిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని రాహుల్ ఆరోపించారు. అలాగే ఎంఐఎం సైతం ఆ పార్టీలకు కొమ్ముకాస్తుందని విమర్శించారు. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో కొట్లాడుతుందో అక్కడ ఎంఐఎం అభ్యర్థులను నిలబెడుతుందని విమర్శించారు. బీజేపీ నుంచి డబ్బులు తీసుకొని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్‌ను, ఢిల్లీలో నరేంద్ర మోదీని గద్దె దింపడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు.