Rahul Gandhi road show in Narsampet: తెలంగాణ ప్రజలకు, సీఎం కేసీఆర్ (Telangana CM KCR) కు మధ్య ఉన్నది కేవలం రాజకీయం సంబంధం మాత్రమేనని, రాష్ట్ర ప్రజలకు, తనకు ఉన్నది కుటుంబ బంధం అన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. గతంలో ఇందిరా గాంధీకి అవసరం ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఆమెకు మద్దతుగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ప్రజలతో తమకు తరతరాల నుంచి అనుబంధం ఉందన్నారు. నర్సంపేటలో కాంగ్రెస్ (Congress) ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో సమస్యలు వచ్చినా, సోనియా గాంధీ వెనక్కి తగ్గకుండా తెలంగాణ ప్రజల కల సాకారం చేశారు. కానీ రాష్ట్రాన్ని తాము కేవలం ఒక కుటుంబ కోసం ఇవ్వలేదని సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. 


తెలంగాణ సంపదను ఒక్క కుటుంబం దోచుకుందని ఆరోపించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ దాదాపు లక్ష కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. స్వయంగా తాను వెళ్లి ప్రాజెక్టును పరిశీలించానని చెప్పారు. మరోపైపు ధరణి అనే వెబ్ సైట్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల భూముల్ని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు లాక్కున్నారంటూ మండిపడ్డారు. రైతులు ధరణి కారణంగా ఎంతో నష్టపోయారు. ఎక్కువ డబ్బులు వచ్చే మంత్రుల శాఖలన్నీ కేసీఆర్ కుటుంబసభ్యులు తమ వద్ద అట్టిపెట్టుకుని ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు.


దళిత బంధు పథకం ఇచ్చేందుకు రూ.3 లక్షల లంచం తీసుకుంటున్నారని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందన్న ప్రశ్నకు రాహుల్ తనదైనశైలిలో బదులిచ్చారు. సీఎం కేసీఆర్ చదువుకున్న స్కూల్స్ కట్టించింది కాంగ్రెస్ అని గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్ లో వేలాది కోట్లు ఐటీ పన్ను వసూలు చేస్తున్నారో దాన్ని రూపొందించింది తమ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది. అధికారంలోకి వస్తే తాము మరోసారి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కరెంట్ కోసం రైతులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన పనిలేదన్నారు. రైతులకు ప్రతి ఎకరాకు ఏడాది రూ.15 వేల పెట్టుబడి అందిస్తాం. రైతు కూలీలకు సైతం తాము రూ.12 వేలు ఇచ్చి ఆదుకుంటామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


మహిళలకు నెలకు రూ.2500 వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తాం. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూ.500కు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. యువ వికాసం ద్వారా ఉన్నత విద్య కోసం రూ.5 లక్షల భరోసా. చేయూత ద్వారా రూ.4 వేల పింఛన్ ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ తొలి కేబినెట్ మీటింగ్ లో ఆరు గ్యారంటీలకు ఆమోదం తెలిపి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవడమే తమ మొదటి పని అని పేర్కొన్నారు. కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసం పనిచేయగా, కాంగ్రెస్ మాత్రం దళిత, బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యం కల్పిస్తాం. కొత్త రిజర్వేషన్లతో మహిళలకు సైతం సముచిత స్థానం వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్న నగదు వెనక్కి వసూలు చేసి ప్రజల కోసం ఖర్చు చేస్తామని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి పనులకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని.. తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ సహకరించగా, కేంద్రంలో బీజేపీకి కేసీఆర్ మద్దతు ఇస్తారని ప్రజలు గుర్తించాలన్నారు. 
Also Read: ప్రతి విద్యార్థినికి స్కూటీ, నెలకు రూ.25 వేల పెన్షన్ - 'అభయ హస్తం' పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో