World Cup Final 2023: భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ను ఈసారి టీమిండియా(Team India) గెలుచుకోవడం ఖాయమని... ఇండియా సూపర్‌స్టార్‌(Super Star) ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు రోహిత్ సేన ఉన్న ఫామ్‌కు టైటిల్‌ సాధించడం పెద్ద కష్టం కాదని తలైవా అన్నాడు. ముంబై (Mumbai)లోని వాంఖడే(Wankhede Stadium) లో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య జరిగిన సెమీఫైనల్‌ను ప్రత్యక్షంగా చూసిన రజినీ ఆ క్షణాలను పంచుకున్నారు. ఆ మ్యాచ్‌ మధ్యలో తాను చాలా ఉత్కంఠను లోనయ్యానని... కానీ టీమిండియా వరుసగా వికెట్లు తీసిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నానని తెలిపాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో తాను చాలా ఉద్వేగానికి గురయ్యానని తలైవా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఒక గంటన్నర పాటు చాలా చాలా నెర్వస్ ఫీలయ్యానని అన్నాడు.


భారత్‌ విధించిన 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌(kiwis) గొప్పగా పోరాడింది. ఓ దశలో క్రికెట్‌ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కేన్‌ విలియమ్సన్‌.. డేరిల్‌ మిచెల్‌ అద్భుత భాగస్వామ్యంతో టీమిండియాను భయపెట్టారు. మూడో వికెట్‌కు వడివడిగా పరుగులు జోడించి లక్ష్యం దిశగా కివీస్‌ను నడిపించారు.  39 పరుగుల వద్ద రెండో వికెట్‌ పడగా... 220 పరుగుల వరకు మరో వికెట్‌ పడకుండా ఆడి మళ్లీ భయాన్ని కలిగించారు. విలియమ్సన్‌ అవుటైనా డేరిల్‌ మిచెల్‌ ఒంటరి పోరాటం చేశాడు. విలియమ్సన్‌ 73 బంతుల్లో 69 పరుగులు చేసి అవుటయ్యాడు. టీమిండియా బౌలర్లపై మిచెల్‌ ఎదురుదాడికి దిగాడు. 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సులతో 134 పరుగులు చేసిన మిచెల్‌ చివరి ఓవర్ల వరకూ క్రీజులోనే ఉండి భయపెట్టాడు. ఇలా గంటన్నర పాటు వీరిద్దరూ నెలకొల్పిన భాగస్వామ్యం అభిమానులనే కాకుండా ప్రముఖలను కూడా చాలా ఆందోళనకు గురిచేసింది. ఒకటిన్నర గంటపాటు వికెట్ పడకపోవటం, కివీస్ బ్యాటర్ల జోరుతో స్టేడియంలోని భారత అభిమానులు ఆందోళన చెందారు. అయితే 33వ ఓవర్ నుంచి షమీ తన జోరు చూపించడంతో కివీస్ 327 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా 70 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏడు వికెట్లు పడగొట్టిన షమీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


మొదట్లో తాను కూడా చాలా ఉత్కంఠకు గురయ్యానని.. కానీ తర్వాత న్యూజిలాండ్‌(New Zeland) వికెట్లు పడుతున్న సమయంలో మంచిగానే అనిపించిందని తెలిపారు. అయితే ఆ ఒకటిన్నర గంట మాత్రం.. చాలా ఉత్కంఠకు లోనయ్యానని.. అయితే ఈసారి మనదే కప్ అని తనకు వందశాతం నమ్మకం ఉందని రజినీ ధీమా వ్యక్తం చేశారు. రజినీ సతీసమేతంగా ఈ మ్యాచ్‌ను చూశారు.


ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు దిగ్గజ క్రికెటర్లు, పారిశ్రామిక, రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఇంగ్లండ్ మాజీ స్టార్‌ ఫుట్‌బాల‌్‌ ప్లేయర్‌ డేవిడ్ బెక్‌హ‌మ్ ఈ మ్యాచ్‌కు హాజరై ప్రత్యక్షంగా వీక్షించారు. బీసీసీఐ సెక్రటరీ జై షా పక్కన ఆసీనుడైన బెక్‌హమ్‌ భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సీరియస్‌గా మ్యాచ్‌ చూస్తూ కనిపించాడు. క్రికెట్‌ గాడ్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య , వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. సినీ తారలు రణ్‌బీర్‌ కపూర్‌, కియారా అడ్వాణీ, విక్టరీ వెంకటేష్‌ ఈ మ్యాచ్‌ను చూసేందుకు వాంఖడేకు తరలివచ్చారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, అపర కుభేరుడు ముఖేష్‌ అంబానీ, అంబానీ కుమారుడు ఆకాష్‌ అంబానీ కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు తరలివచ్చారు.