Telangana Assembly sessions | పరకాల: పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, తమ ప్రజా ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతుందో చర్చించడానికి సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షాల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తప్పకుండా రావాలని సవాల్ విసిరారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న కేసీఆర్ సమక్షంలోనే గత పదేళ్ల సంక్షేమం, అభివృద్ధి.. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చిద్దామని కేసీఆర్‌ను ఆహ్వానించారు.
హనుమకొండ జిల్లా పరకాలలో రూ.484 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అక్కడ నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు సాగించిన దాడులు, ఫోన్ ట్యాపింగ్ వంటి అణచివేత చర్యలను ప్రజలు తమ చైతన్యంతో తిప్పికొట్టారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆరితేరిన దిగ్గజాలను కూడా సామాన్య ప్రజలు ఓడించగలరని, యశస్విని అనే యువతి 50 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడమే అందుకు నిదర్శనమని అన్నారు. ఈ గెలుపు తనది కాదని, ప్రజల చైతన్యానిదని, ఆ చైతన్యమే ఈ ప్రాంతంలో 12 స్థానాలకు గాను 10 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేసిందన్నారు.
సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా..అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ప్రతిపక్ష నేతలు చేస్తున్న కామెంట్లపై స్పందించారు. సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ చర్చకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరు కావాలని.. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై.. ప్రస్తుత ప్రజా ప్రభుత్వ రెండు సంవత్సరాల పాలనపై బహిరంగంగా చర్చిద్దామని ఆయన సవాల్ విసిరారు.
రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన బీఆర్ఎస్..
గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం గురించి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఏటా 6,500 కోట్ల రూపాయల అప్పుల భారం ఉంటే, కెసిఆర్ ప్రభుత్వం దిగిపోయేనాటికి 8,11,000 (8 లక్షల 11 వేల కోట్ల రూపాయలు) కోట్ల భారీ అప్పును వారసత్వంగా ఇచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ అప్పులకు అసలు, వడ్డీ కలిపి నెలకు 7,500 కోట్లు, అంటే ఏడాదికి సుమారు 75,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తోందని వివరించారు. ఇన్ని కష్టాల్లోనూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తాను రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నానని.. గత 32 నెలల్లో ఏ రోజూ కనీసం మూడు రోజులు కూడా విరామం తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.
వ్యవసాయం, మౌలిక సదుపాయాల గురించి ప్రస్తావిస్తూ, లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను రేవంత్ రెడ్డి ఎత్తిచూపారు. ఆ ప్రాజెక్టును ఆయన 'కూలేశ్వరం'గా అభివర్ణించారు. అయితే, తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ, గత 30 నెలల్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి 90,000 కోట్ల రూపాయలు చెల్లించిందని గుర్తుచేశారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు
