న్యూఢిల్లీ: భారత్‌లో 2027 జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గృహ సమగ్ర వివరాల సేకరణ (హౌస్‌హోల్డ్ షెడ్యూల్) ప్రక్రియ కింద అధికారులు ప్రజలను అడగబోయే 40 ముఖ్యమైన ప్రశ్నల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధికారికంగా విడుదల చేసింది. ఈ సేకరణ ద్వారా దేశంలోని జనాభా, వారి జీవన ప్రమాణాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్రమైన అవగాహన వస్తుంది. అయితే, జనాభా లెక్కల సేకరణ సమయంలో అధికారులకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాధానాలు ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, చట్ట ప్రకారం జైలు శిక్ష పడే అవకాశం ఉందా అనే అంశాలపై కొన్ని నిబంధనలు ఉన్నాయి.

Continues below advertisement

1948 జనాభా లెక్కల చట్టం ప్రకారం, మీ ఇంటికి వివరాలు సేకరించేందుకు వచ్చే అధికారులకు సరైన, వాస్తవ సమాచారాన్ని అందించడం ప్రతి పౌరుడి బాధ్యత. ఈ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం, జనాభా సేకరణ అధికారులు అడిగే ప్రశ్నలకు పౌరులు కచ్చితమైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దేశ భవిష్యత్తు కోసం జాతీయ స్థాయి ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా రూపొందించడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. అందువల్ల జనాభా సేకరణ అధికారులను కావాలని దారి మళ్లించడం లేదా తప్పుడు వివరాలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. కనుక ప్రజలు అధికారులకు సరైన వివరాలు ఇచ్చి సహకరించాలని కోరుతున్నారు.

ఈ చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించినా, కీలక వివరాలను దాచిపెట్టినా లేదా అధికారుల విధులకు ఆటంకం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. నేరం నిరూపణ అయితే గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదా ₹1,000 వరకు జరిమానా, లేదా పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాలలో రెండూ విధించే అవకాశం ఉంది. అయితే పొరపాటున లేదా సరిగ్గా గుర్తులేక తప్పు చెప్పిన వారికి ఈ శిక్ష వర్తించదని చట్టం చెబుతోంది. కేవలం కావాలని మోసం చేసే ఉద్దేశం ఉందో లేదో మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు, ఇల్లు కట్టిన సంవత్సరం సరిగ్గా గుర్తులేకపోతే ఊహించి ఏదో ఒక సంవత్సరం చెప్పడం కంటే సరిగ్గా తెలియదు అని నిజాన్ని చెప్పడం మంచిది.

Continues below advertisement

అధికారులపై సైతం చర్యలకు అవకాశం

ఈ చట్టం కేవలం పౌరులపైనే కాకుండా వివరాలు సేకరించే అధికారులపై కూడా సమానమైన బాధ్యతను ఉంచింది. పౌరులు ఇచ్చిన సమాచారాన్ని అధికారులు కావాలని మార్చడం లేదా డిజిటల్ సిస్టమ్‌లో తప్పుగా నమోదు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. జనాభా సేకరణ, డేటా అప్‌లోడ్ చేయడంలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. అదే సమయంలో, ఈ చట్టం స్థానిక ఆచారాలు, సాంస్కృతిక పద్ధతులకు ఈ ప్రక్రియలో తగిన మినహాయింపులను కల్పించారు. స్థానిక పద్ధతుల ప్రకారం కుటుంబంలోని మహిళల పేర్లను బయటి వ్యక్తులకు చెప్పకూడదనే నిబంధన ఉన్నా, లేదా భర్త పేరు ఉచ్చరించకూడదనే సంప్రదాయం ఉన్నా, ఆ వివరాలు చెప్పడానికి నిరాకరించడాన్ని నేరంగా లేదా సమాచారాన్ని దాచడంగా పరిగణించరు. కానీ వివరాలు మాత్రం నమోదు చేయడానికి ఏదో విధంగా అందించక తప్పదు. లేకపోతే జనాభా లెక్కల్లో వారి వివరాలు మాయమయ్యే ప్రమాదం లేకపోలేదు.