ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణ బీజేపీ నేతల్లో జోష్ తీసుకొచ్చాయి. దాంతో రాష్ట్రంలోని ఆ నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం ఆశావాహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక కార్యకర్తల అభిమానాన్ని చొరగోనే ప్రయత్నాలలో కొందరు లీడర్లు ఉండగా రాష్ట్ర స్థాయి నేతలను ప్రసన్నం చేసుకునే పనీలో మరికొందరు ఉన్నారు. ఇంతకీ ఉత్కంఠ నెలకొన్న ఆ నియోజకవర్గం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం. రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్ మూడ్ రావడంతో బీజేపీ నాయకులు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు.
టికెట్ల కోసం బీజేపీలో పెరిగిన పోటీ..
తమ నియోజకవర్గంలో బీజేపీ టిక్కెట్ ఆశించే ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో నాలుగు రాష్ట్రాలలో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేయడంతో బీజేపీ నాయకులలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీకే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా నియోజకవర్గం టికెట్ సాధించాలని ఆశావాహులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
సీటు కోసం తగ్గేదేలే!
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుఫున పోటిచేసేందుకు ఆశావాహుల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతుంది. గత ఎన్నికల్లో బీజేపీ తరుపున వరంగల్ పశ్చిమలో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ఇసారి కూడా టికెట్ తనకే వస్తుందని ధీమాతో సైలెంట్ గా ఉన్నారు. రాష్ట్ర స్థాయి నాయకులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ టికెట్ దక్కించుకునేలా కనిపించారు. ఇప్పటికే హనుమకొండ జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతున్న రావు పద్మ పలు ఆందోళన కార్యక్రమాలతో వరంగల్ పశ్చిమలో ప్రజల మన్ననలూ పోందే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఉన్న ప్రజాబలం ఉందని చూపించి రాష్ట్ర అగ్ర నేతల మెప్పు పొందేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
వరంగల్ పశ్చిమలో గెలిచే సత్తా తనకుందనీ బీజేపీ అధిష్టానానికి సంకేతాలు చేరవేసి, ఎన్నికల్లో టికెట్ సాధించుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు యువ నేత, బీజేపీ అధికార ప్రతినిధిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా వరంగల్ పశ్చిమ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే రాకేష్ రెడ్డి గత నెల రోజులుగా వరంగల్ పశ్చిమలోనే తిష్టవేసి కార్యకర్తలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా యవతకు దగ్గరవుతూ నిత్యం వారితో సమావేశాలు నిర్వహించి, పార్టీ కార్యక్రమాలలో పాల్గోనేలా ప్రోత్సహిస్తూన్నారు. యవతలో, కార్యకర్తల్లో తనకు ఉన్న బలాన్ని చూపిస్తూ టిక్కెట్ సాధించేందుకు తన స్టైల్లో రాజకీయం మొదలుపెట్టడంతో టికెట్ రేసు రసవత్తరంగా మారింది.
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం నెలకొన్న పోటాపోటీ ఇతర చోట్ల లేకపోవడంతో స్థానిక రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.. ధర్మారావు, రావు పద్మ, రాకేష్ రెడ్డి ఈ ముగ్గురిలో ఎవరీకీ వరంగల్ పశ్చిమ టికెట్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల్లో చర్చ మొదలైనట్లు పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికీ నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించి ఏ నేతకు ప్రజాదరణ ఉంటుందో వారికే టికెట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని బీజేపీ అధిష్టానం స్థానిక నేతలకు సంకేతాలు పంపినట్లు సమాచారం.
Also Read: KCR On The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్‌పై చర్చ ఇప్పుడు అవసరం లేదు, రైతు సమస్యలపై మాట్లాడాలన్న సీఎం కేసీఆర్