టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. 30 నియోజకవర్గాల్లో ఒక స్థానం కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. బీజేపీకి మతపిచ్చి పట్టుకుందని ఆరోపించారు.  తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని, రైతుల‌ను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాడాల‌ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ నుంచి కూడా కేంద్రం రెండు పంట‌లు కొనేలా ఉద్యమం చేయాలని నిర్ణయించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో సీఎం కేసీఆర్ ఆ పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. వ్యవ‌సాయ ఉత్పత్తుల‌కు రాజ్యాంగ ర‌క్షణ అవ‌స‌రమన్నారు. తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రంగా ఆందోళ‌న చేప‌డుతామ‌న్నారు. తెలంగాణపై కేంద్రం ప‌క్షపాతం చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 






24, 25 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు 


కేంద్రంలో అధికారంలో బీజేపీ అన్ని రంగాల్లో విఫ‌ల‌మైంద‌ని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభ‌జ‌న చ‌ట్టం హామీల‌ను అమ‌లు చేయ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైందన్నారు. రైతు వేసే ప్రతి గింజ‌కు కేంద్రం గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలన్నారు. 24, 25 తేదీల్లో రైతుల‌కు మ‌ద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 28వ తేదీన యాదాద్రికి పార్టీ శ్రేణులంతా త‌ర‌లిరావాల‌ని కోరారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు త‌లెత్తకుండా సబ్ క‌మిటీ చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం కేసీఆర్ సూచించారు.


కశ్మీర్ ఫైల్స్ పై విమర్శలు


టీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్పీ సమావేశంలో సీఎం కేసిఆర్‌ హాట్ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మరింతగా ఉద్యమించాల్సిన టైం వచ్చిందన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కశ్మీర్ ఫైల్స్‌ తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలపై చర్చించాలన్నారు సీఎం కేసీఆర్. అంతేకానీ కశ్మీర్ ఫైల్స్‌పై కాదని అభిప్రాయపడ్డారు. రైతు వేసే పంటలన్నిటికి  గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు కేసీఆర్. దీని కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు నేతలకు వెల్లడించారు.