వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో స్టేషన్ ఘన్‌పూర్ ప్రస్తుత ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య పేరు లేకపోవడంతో ఆయన షాక్ తిన్న సంగతి తెలిసిందే. ఆయన శత్రువు అయిన కడియం శ్రీహరికి ఈసారి టికెట్ ఇచ్చారు. దీంతో ఈసారి కూడా టికెట్ తనకే వస్తుందని ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పుకున్న రాజయ్య ఒక్కసారిగా ఏడ్చేశారు. మంగళవారం (ఆగస్టు 22) స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చిన ఆయన కింద పడి మరీ బోరున ఏడ్చారు. జనగామలో అంబేద్కర్ విగ్రహం దగ్గర వర్షంలోనే తడుస్తూ కాసేపు మౌనదీక్ష చేశారు. 


తాను ఎన్నడూ సీఎం కేసీఆర్ గీసిన గీత దాటలేదని రాజయ్య అన్నారు. తొలి నుంచి తాను కేసీఆర్‌కు వీర విధేయుడిగానే ఉన్నానని గుర్తు చేసుకున్నారు. టికెట్‌ రాకపోయినా సరే, తాను కేసీఆర్ గీసిన గీత దాటబోనని అన్నారు. 2001 నుంచి ఇప్పటి వరకూ తాను కేసీఆర్‌ను ఒక్క మాట కూడా అనలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. తన అనుచరులతో మాట్లాడుతూ.. అందరూ సమన్వయం పాటించాలని అన్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు కూడా ఆయన్ని పట్టుకుని ఏడ్చారు.


‘‘ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతి గ్రామానికి సీడీఎఫ్ కింద 3 కోట్లు మంజూరయ్యాయి. అభివృద్ధి పనులు కొనసాగుతాయి. 15 సంవత్సరాల రాజకీయ అనుభవం, అధికార కాంగ్రెస్ పార్టీకి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి తెలంగాణ కోసం రాజీనామా చేశా. స్థాయికి తగ్గకుండా ఉన్నత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.. దళిత బంధుకు 1,100 మందికి వచ్చే విధంగా సిఫారసు చేశా.. ఘనాపూర్ ప్రజల మధ్యే నా జీవితం’’ అని రాజయ్య పేర్కొన్నారు.


అప్పట్లో తాను కాంగ్రెస్ పార్టీలో ఉండగా, రాజీనామా చేసి రమ్మంటే టీఆర్ఎస్ లోకి కేసీఆర్ మాట ప్రకారమే వచ్చానని అన్నారు. తన స్థాయికి తగ్గట్లుగా పార్టీలో సముచిత స్థానం ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. అప్పటి నుంచి తాను కేసీఆర్ గీసిన గీత దాటలేదని అన్నారు. ఇకపై కూడా తాను తూచా తప్పకుండా పని చేస్తానని అన్నారు.