ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ఆర్‌ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల... మాజీ మంత్రి కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. పదవిలో ఉండి కూడా ఏం చేయలేని కడియం శ్రీహరి లాంటోళ్లే అసలైన తెలంగాణ ద్రోహులంటూ విరుచుకుపడ్డారు.


మాజీ మంత్రి కడియం శ్రీహరి చాలా పెద్ద మనిషి అనుకున్నానని అన్నారు షర్మిల. ఏళ్ల తరబడి మంత్రిగా ఉండి కూడా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు తీసుకురాని చేతగాని వ్యక్తి తెలంగాణ వ్యతిరేకా... నీటి ప్రాజెక్టు నిర్మించి లక్షల ఎకరాలను తడిపిన రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకా అని ప్రశ్నించారు షర్మిల.  ఆ కాలంలోనే వరంగల్ జిల్లాకు పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొచ్చారని షర్మిల గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా డిగ్రీకాలేజ్, ఇంటర్ కాలేజీ పెట్టించలేని కడియం శ్రీహరి తెలంగాణ వ్యతిరేకా అని ప్రశ్నించారు. ఉద్యమం పేరు చెప్పి అధికారాన్ని అనుభవిస్తున్న కడియం శ్రీహరి లాంటోళ్లు తెలంగాణ ద్రోహులు అని అన్నారు. 


ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను కేసీఆర్ వెన్నుపోటు పొడిస్తే వైఎస్‌ఆర్‌ బిడ్డగా వాటిని చూస్తు తట్టుకోలేక తెలంగాణలో పార్టీ పెట్టానన్నారు షర్మిల. ఈ తెలంగాణ గడ్డమీదనే పుట్టిందని... ఇక్కడే చదువుకుంది... ఇక్కడే పెళ్లి చేసుకొని పిల్లలని కూడా కనిందన్నారు. అందుకే తెలంగాణ గడ్డకు సేవ చేయాలన్న సంకల్పంతోనే పార్టీ పెట్టానన్నారు. కేసీఆర్ తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే పాదయాత్ర చేస్తూ ఆయన వైఫల్యాలను, ప్రభుత్వం ఇచ్చిన ఎండగడుతున్నామన్నారు. అందుకే తమపై రకరకాల ప్రచారాలు, దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కడియం ఏమన్నారంటే?


ఈ మధ్య మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి... జగన్ గ్రాఫ్ పడిపోతోందని.. జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ వస్తుంది..   ఏపీకి వెళ్లాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుషర్మిలకు  కడియం సలహా ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల బడ్జెట్‌పై విమర్శలు చేశారు. దీనికి కౌంటర్‌గా మీడియా సమావేశం నిర్వహించిన కడియం శ్రీహరి.. షర్మిల ఏపీలో రాజకీయాలు చేయాలనిసలహా ఇచ్చారు.  వైఎస్ కుటుంబం తెలంగాణకు మొదటి నుంచి వ్యతిరేకమేనని చెప్పారు. పాదయాత్ర చేసి అన్నను సీఎంను చేసిన షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలతో మొర పెట్టుకోవాలని సూచించారు. జగన్ గ్రాఫ్ పడిపోతోందని, రేపో మాపో ఆయన జైలుకు వెళ్తే షర్మిలకు పదవి దక్కే అవకాశముందని అన్నారు. 


తెలంగాణ బిల్లు ఆమోద విషయంలో వైఎస్ జగన్,షర్మిల సమైక్య నినాదానికి తెరలేపిన వారని కడియం శ్రీహరి గుర్తు చేశారు. అలాంటి షర్మిల నేడు తెలంగాణలో వైఎస్ శర్మిలకు ఓటు అడిగే నైతిక హక్కు ఉందా అని  ప్రశ్నించారు. షర్మిల   కుటుంబ పరంగా నష్టపోయారని.. ...తన అన్న జగన్... ఆమెను రాజకియంగా దెబ్బ తీశారన్నారు.  గతంలో శర్మిల పాదయాత్ర తోనే జగన్ సీఎం అయ్యాడన్నారు. ఆ సానుభూతి ఇక్కడ పనిచేయదు...రేపో మాపో సిఎం జగన్ జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయి ..కాబట్టి.. ఏపీకి వెళ్లాలన్నారు. షర్మిలకు రాజకియ భవిష్యత్తు ఆంధ్రాలో ఉంటుందన్నారు.  ఈ ప్రయత్నాలు అక్కడ చేసుకోవడం బెటర్ అని సూచించారు.  తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ షర్మిల సమయాన్ని వృథా చేసుకోవద్దని కడియం సూచించారు. 


వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల దాడులు చేయడంతో నిలిచిపోయింది. అనంతరం షర్మిల హైకోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు. నర్సంపేట నియోజకవర్గం, చెన్నారావు పేట మండలం శంకరమ్మతండా వద్ద నుంచి మళ్లీ ప్రారంభించారు. ఈ నెలాఖరు కల్లా పెండింగ్‌ నియోజకవర్గాల్లో పాదయాత్రను పూర్తి చేసి మహబూబాబాద్‌ నియోజకవర్గం మీదుగా పాలేరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. ప్రజాప్రస్థానం ముగింపు సభ ఖమ్మం రూరల్‌ మండలంలో జరగనుంది. వచ్చే ఎన్నికల్లో షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.