Revanth Reddy Comments: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మహబూబాబాద్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. నిజాం తనను కాపాడుకోవడానికి రజాకార్ల వ్యవస్థను  ఏర్పాటు చేసుకుంటే.. నేడు సీఎం కేసీఆర్ పోలీసుల సాయంతో నయా నిజాంగా వ్యవహరిస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన ప్రగతి భవన్ లోకి సామాన్య ప్రజలకు ఎందుకు అనుమతి లేదని ఆయన ప్రశ్నించారు.


తెలంగాణ ఉద్యమ ద్రోహులందరికి ప్రగతి భవన్ నేడు అడ్డాగా మారిందని ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ కానీ, గడీలను కానీ కూల్చివేస్తామని మరోసారి వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల అడ్డగా ప్రగతి భవన్ మారిందని ఫైర్ అయ్యారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ఎందుకని మండిపడ్డారు. నక్సలైట్ల ఎజెండా, తమ ఎజెండా ఒకటే అన్న కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయరని పోలీసులను నిలదీశారు. అదే మాట అన్న తనపై మాత్రం కేసులు పెట్టడంలో పోలీసుల ఉద్దేశం ఏంటని అడిగారు.






సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు ఇచ్చుకొని.. కుటుంబ పాలన సాగించడం దుర్మార్గమన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం తెలంగాణ వాణిని వినిపించిందని.. తుది దశ ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్నీ సాధించిందని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజా పాలన కోసం మరో ఉద్యమం తప్పదు అని వెల్లడించారు. ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడడం కోసం తాను ఎన్ని కేసులనైనా ఎదుర్కొవడానికి సిద్దమేనని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


9 నెలల్లో సచివాలయం, ప్రగతి భవన్ కట్టిన ముఖ్యమంత్రికి అమరుల స్థూపం కట్టడానికి 8 సంవత్సరాల కాలం సరిపోలేదని ఎద్దేవా చేశారు. పోడు భూముల సమస్యలు, పేదలకు ఇళ్లు, వరంగల్ రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న 317 జీఓను రద్దు చేస్తామన్నారు. రాష్ట్రంలో దుబారా ఖర్చును తగ్గిస్తే తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేశారు. రసమయి బాలకిషన్ ఉద్యమ కారుడని, విద్యావంతుడు కాబట్టి ఆయన్ను మంత్రి చేయొచ్చు కదా అని సూచించారు. ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ల మీద పడ్డ వ్యక్తి కేసీఆర్ అంటూ తెలిపారు. కేసీఆర్ కు చేత కాదనే ప్రొఫెసర్ కోదండరాంను టీ జేఏసీ చైర్మన్ చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 


నిన్నటి యాత్రలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే.. డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రేజశ్వర్ రెడ్డి



మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 8వ తేదీ బుధవారం రోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో... సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయంతో పాటు నివాసాన్ని గ్రానైట్లు పెట్టి పేల్చాయాల్సిందిగా కోరారని వివరించారు. చట్టసభల్లో సభ్యుడిగా ఉండి.. అధికార భవనాలను కూల్చివేయమని కోరడం అంటే ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేక చర్యగా భావించి.. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపని కోరారు.