ధనుష్ హీరోగా నటించిన ‘సార్’ సినిమా ట్రైలర్‌ను నిర్మాతలు బుధవారం విడుదల చేశారు. ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ జంటగా నటించింది. 'భీమ్లా నాయక్', నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రమిది. ‘తొలి ప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించారు.


విద్యా వ్యవస్థను కథా వస్తువుగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం పీరియాడిక్ చిత్రాల ట్రెండ్ నడుస్తుంది. ఈ సినిమా కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అయింది. ట్రైలర్‌లో మాస్, యాక్షన్, లవ్ లాంటి అంశాలతో పాటు మెసేజ్‌ను కూడా అందించారు.



సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. జాతీయ అవార్డు అందుకున్న జీవీ ప్రకాష్ కుమార్ పాటలు అందించారు. ఈ సినిమా తమిళ వెర్షన్ ఆడియో లాంచ్ ఇటీవలే తమిళనాడులో గ్రాండ్‌గా జరిగింది.


ధనుష్‌కు తొలి తెలుగు స్ట్రయిట్ సినిమా ఇదే. తమిళంలో ‘వాతి’ పేరుతో ఈ సినిమాను విడుదల కానుంది. ప్రస్తుతం విజయ్‌తో ప్రతిష్టాత్మక ‘లియో’ సినిమా తెరకెక్కిస్తున్న 7 స్క్రీన్ స్టూడియోస్ సంస్థ ‘వాతి’ని తమిళనాట డిస్ట్రిబ్యూట్ చేయనుంది.


ఫిబ్రవరి 17వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ ను కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు. 'మాస్టారూ మాస్టారూ నా మనసుని గెలిచారు' అంటూ సాగే ఈ పాటను శ్వేతామోహన్ పాడింది. ఇదొక మెలోడీ సాంగ్. ఈ సాంగ్ ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో ధనుష్ 'బాల గంగాధర్ తిలక్' అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ కూడా చాలా నేచురల్ గా ఉంది. 


'సూదు కవ్వం', 'సేతుపతి', 'తెగిడి', 'మిస్టర్ లోకల్', 'మార' తదితర చిత్రాలకు పనిచేసి దినేష్ కృష్ణన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కాగా.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జీవీ ప్ర‌కాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి కుమార్,తనికెళ్ల భ‌ర‌ణి, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌), ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా, స‌మ‌ర్ప‌ణ: పి.డి.వి. ప్ర‌సాద్‌.


ధనుష్ హీరోగా నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటిది 'మారన్' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కాగా... 'తిరు', 'నేనే వస్తున్నా' సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్'లో కూడా ధనుష్ కనిపించారు. 2023లో ధనుష్‌కు మొదటి రిలీజ్ ఇదే. సమ్మర్ తరువాత అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ‘కెప్టెన్ మిల్లర్’ విడుదల కానుంది.


అలాగే ఇటీవలే సన్ పిక్చర్స్ బ్యానర్‌తో ‘D50’ సినిమాను కూడా అధికారికంగా ప్రకటించారు. ఇది ధనుష్‌కు ప్రతిష్టాత్మక 50వ సినిమా కానుంది. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ధనుషే చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ధనుష్ ఇప్పటికే దర్శకుడిగా కూడా తనేంటో నిరూపించుకున్నాడు. రాజ్ కిరణ్ లీడ్ రోల్‌లో ‘పవర్ పాండి’ అనే సినిమా తీసి హిట్ కొట్టారు. ఆ తర్వాత ఎంతో భారీగా రెండో సినిమాను కూడా ఓపెనింగ్ చేశారు. కానీ అనుకోని కారణాల రీత్యా ఆ సినిమా ఆగిపోయింది.