Medaram Jatara 2022: ఆసియాలోనే అతి పెద్ద జాతర మేడారం(Medaram) జాతర వైభవంగా సాగుతోంది. జాతరలో ముఖ్యమైన ఘట్టం నిన్న రాత్రి ఆవిష్కృతమైంది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క(Sammakka) లాంఛనంగా గద్దెపైన కొలువు దీరింది. దీని కోసం లక్షల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. 


సమ్మక్క గద్దెపై కొలువు దీరడంతో ఒక్కసారిగా భక్తులు ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు. 


గురువారం రాత్రి 9.20 నిమిషాలకు సమ్మక్క గద్దెపై కూర్చున్నారు. ఆ వేడుకను చూసిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. తమను చల్లగా చూడు తల్లీ అంటూ గట్టిగా వేడుకున్నారు. 


గన్ పేల్చి అధికారికంగా సమ్మక్క కు ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ స్వాగతం పలికారు. సమ్మక్క గద్దెనెక్కినప్పుడు ఇలా తుపాకీ పేల్చడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. 






ముందుగా ఉదయం మేడారంలోని సమ్మక్క ఆలయాన్ని పూజలు శుద్ధి చేసి శక్తి పీఠాన్ని అందంగా అలంకరించారు. తర్వాత అడవి నుంచి వెదురువనం, ఆడేరాలు తెచ్చి గద్దెపై పెట్టారు. ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్యతోపాటు దూపం, జలకం వడ్డెలు, సహాయక పూజారులు సాయంత్రం చిలుకల గుట్టపైకి వెళ్లారు. 


రహస్య ప్రదేశంలో సమ్మక్క రూపమైన కుంకుమ భరిణెకు ప్రత్యేక పూజలు చేశారు. అది పూర్తివ్వగానే తిరిగి బయల్దేరారు. 


ఆనవాయితీ ప్రకారం వనదేవతకు  మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగం స్వాగతం పలికారు. 


సమ్మక్క సారలమ్మ జాతర రెండు రోజుల క్రితమే లాంఛనంగా స్టార్ట్ అయినా వారం పది రోజుల ముందు నుంచే భక్తుల రాక మొదలైంది. ఇప్పుడా తాకిడి మరింతగా పెరిగింది. ఎక్కడ చూసిన ఎటు చూసిన జనమే కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు అరవై లక్షలకుపైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. 


జంపన్న వాగులో రాత్రి పగలు భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఆ వాగు చూస్తుంటే కుంభమేళాను తలపిస్తోంది. గురువారం సమ్మక్క రాక సందర్భంగా శివసత్తలు నీటిలో వలయాకారంగా నిలబడి నృత్యాలు చేశారు. చర్నాకోల్‌తో విన్యాసాలు చేశారు.






సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చే టైంలో ఆదివాసీలు ధింసా నృత్యం చేశారు. 


గురువారం వనదేవతులను తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, వీరయ్య, ఛత్తీస్‌గఢ్‌ మంత్రి లక్మ, అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే పద్మావతి మేడారం వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.