తెలంగాణవ్యాప్తంగా కోట్ల మంది భక్తులతో నీరాజనాలు అందుకుంటున్న సమ్మక్క సారక్క జాతర(Samakka Saralamma Jatara) గ్రామగ్రామాన ఘనంగా జరుగుతోంది. లక్షల మంది అమ్మవారిని దర్శించుకునేందుకు మేడారం(Medaram) వెళ్తున్నారు. తమ మొక్కులు తీర్చుకొని తిరిగి వస్తున్నారు.
మేడారం జాతర సందర్భంగా నకిలీ నోట్ల(Fake Currency) ముఠాలు కూడా రెచ్చిపోతున్నాయి. ఇదే మంచి తరుణం అనుకొని దొంగనోట్లు ముద్రించి అమ్మేందుకు ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నాయి.
ఇలాంటిది ముందే పసిగట్టిన పోలీసులు రెండు నెలల క్రితం నుంచే ఇలాంటి ముఠాలపై నిఘా పెట్టారు. ఈ మధ్య ఓ ముఠాను కూడా పట్టుకున్నారు. మరికొందరి కదలికలపై ఫోకస్ పెట్టారు. అయినా కేటుగాళ్లు తమ పని తాము చేసుకొని వెళ్లిపోతున్నారు.
వనదేవతలను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాడనికి వచ్చే భక్తులు కొందరు అక్కడ అరుదుగా దొరికే వస్తువులు, దేవతల చిత్రపటాలు, ఇతర బొమ్మలు కొంటున్నారు. మరికొందరు టిఫెన్లు చేస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లోనే టార్గెట్‌గా చేసుకున్నారు కొందరు దోపిడీగాళ్లు.
ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలోని ఓ మండల కేంద్రంలో గల వైన్స్‌లో దొంగ నోటు కలకలం సృష్టించింది.వంద రూపాయల నోటు తీసుకుని వచ్చిన ఓ యువకుడు మిగతా నోట్లతో బాటు చెలామణి చేయడానికి ప్రయత్నించాడు.అయితే అనుమానం వచ్చిన ఆ వైన్స్ సిబ్బంది ఒకసారి దాన్ని చెక్ చేశారు. అది దొంగ నోటుగా తేల్చి మిషన్ వేయగా మిషన్ కూడా దానిని తిరస్కరించింది.
వెంటనే దానిపై దొంగనోటు గా మార్క్ పెట్టిన క్యాషియర్ ఆ నోట్లు తిరిగి ఆ యువకుడికి ఇచ్చివేశాడు. ఇంకా ఎంతమందికి ఈ నోట్లు అంటగట్టి ఉంటారో అన్న ఆందోళన మొదలైంది. ఇలా చేస్తే సామాన్యులు కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
ఓవైపు భక్తుల హడావుడి మధ్య పండుగ ఘనంగా జరుగుతుంటే మరోవైపు దొంగనోట్ల చెలామణి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కొన్ని ముఠాలు. ఏం కొన్నా, ఎవరు ఊరికే డబ్బులు ఇచ్చిన తీసుకోవద్దని పోలీసులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.