Munneru Paleru Reservoir |  హైదరాబాద్: సముద్రంలోకి వృథాగా వెళ్తున్న  మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్ కు మళ్లించడానికి  మున్నేరు -పాలేరు లింక్ కెనాల్ కు తెలంగాణ (Telangana) ప్రభుత్వం రూ.162.54 కోట్లు విడుదల చేసిందని రెవెన్యూ, హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 98 ని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

గత ప్రభుత్వానికి ఈ ఐడియా రాలేదు

సముద్రంలోకి పోయే వరద నీటిని రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా  మళ్లించాలన్న ఆలోచన గత  పదేళ్లు ఏలిన brs ప్రభుత్వానికి రాలేదని మంత్రి పొంగులేటి అన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం  తీసుకున్న తాజా నిర్ణయం వల్ల వృధాగా పోతున్న వరద నీటిలో సుమారు 10 టిఎంసిల నీటిని పాలేరు రిజర్వాయర్ (Paleru Reservior) కు మళ్లించవచ్చని తెలిపారు. తద్వారా ఈ రిజర్వాయర్ పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. ఇందులో ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కు పొంగులేటి ధన్యవాదాలు పాలేరు లింక్ కెనాల్ కు నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సూర్యాపేట,  మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు తాగునీరు,  డోర్నకల్ నియోజకవర్గం పరిధిలో 10 చెరువులకు సాగునీరుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

 ప్రతీ ఏటా వర్షాకాలంలో వస్తున్న వరద నీరు వృధా కాకుండా ఒడిసి పట్టాలనే ఆలోచనతో మున్నేరు నుంచి పాలేరుకు లింక్ కెనాల్ ను మంజూరు చేసుకున్నామని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. గత ఏడాది మున్నేరు వాగు పొంగడం ద్వారా ఖమ్మం జిల్లాలో వరదలు సంభవించాయని తెలిసిందే.