వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకే తప్ప కార్మికుల సమస్యలు తీర్చడానికి సీఎం కేసీఆర్ కుటుంబం ప్రయత్నించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయి అవిభక్త కవలల్లా కలిసి పనిచేశాయని విమర్శించారు. ఇప్పుడు విడిపోయినట్లు నాటకాలు ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఆయన భూపాలపల్లి సింగరేణి 5వ గనిలో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించారు.
కార్మికుల సమస్యలను కేసీఆర్ కుటుంబం తీర్చట్లేదు - రేవంత్
‘‘ఆనాటి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైంది. సకల జనుల సమ్మెకు సైరన్ ఊది కార్మికులు నడుం బిగించాకనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బొగ్గుగని కార్మిక సంఘానికి కవిత, ఆర్టీసీ కార్మిక సంఘానికి హరీష్ రావు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. కార్మిక సంఘాలను కూడా వారి కుటుంబమే గుత్తాధిపత్యం చేసి అధికారంలో కొనసాగుతున్నారు. సీఎం కూతురే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నా బొగ్గు గని కార్మికుల సమస్యలు పరిష్కరించడంలేదు? వేలాది కోట్ల కొల్లగట్టడానికే తప్ప.. కార్మికుల సమస్యలు తీర్చడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నించడం లేదు. ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ, బీఆరెస్ అవిభక్త కవలల్లా కలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు వేరుగా ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు.
తాడిచర్ల మైన్ లో కేసీఆర్ కుటుంబం వాటా ఎంత? - రేవంత్ రెడ్డి
మోదీ నిర్ణయాలన్నింటికీ కేసీఆర్ సహకరించారు. ప్రజా వ్యతిరేకత చూసి భయంతో వేరుగా ఉన్నామని చూపే ప్రయత్నం చేస్తున్నారు. తాడిచర్ల మైన్ ను కేసీఆర్ ఎవరికి అప్పగించారు? తాడిచర్ల మైన్ లో కేసీఆర్ కుటుంబం వాటా ఎంత? ఒడిశాలో ఉన్న కోల్ మైన్ ను ఆదానికి అమ్మేస్తే దానిపై కాంగ్రెస్ ఎంపీలం కొట్లాడాం. అందుకే నైని కోల్ మైన్ అమ్మకం ఆగిపోయింది. ప్రతిమా శ్రీనివాస్ కు లాభం చేకూర్చేందుకు కేసీఆర్ ఈ ఒప్పందానికి సహకరించింది వాస్తవం కాదా? కేసీఆర్, మోదీలది కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానం. శ్రీధర్ ను సీఎండీగా కొనసాగించడం వెనక కేసీఆర్ కు ఉన్న ఉపయోగం ఏమిటో ఆలోచించండి. లాభాల్లో ఉన్న సింగరేణిని దివాళా తీయించేందుకు సీఎండీ శ్రీధర్ ప్రయత్నిస్తున్నారు.
వీటన్నింటిపై కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణకు అదేశిస్తాం. సింగరేణిని లాభాల బాటలో పయనించేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయి. ఎవరు అధికారంలో ఉంటే కార్మికుల కష్టాలు తీరుతాయో ఆలోచించండి. కార్మికుల సమస్యల పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. కేసీఆర్ మారడు.. ఇక ఆయన్ని మార్చాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ తెచ్చిన అని చెప్పిన కేసీఆర్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉంది. తెలంగాణ సాధించడమే కాదు.. దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కార్మికులపై ఉంది’’ అని రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
భూపాలపల్లిలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్తత
భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీల ఘర్షణ ముదిరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడికి దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇవాళ భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే మొన్న మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లెక్సీలు కడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేటీఆర్ పర్యటన ముగిసినా ప్లెక్సీలు ఎందుకని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ రెడ్డి కటౌట్‌ను అడ్డుకోవడంతో అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త టవర్ ఎక్కాడు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. మొత్తానికి పోలీసులకు లాఠీచార్జ్ చేశారు.