Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ఐదో రోజు జడ్చర్ల నుంచి ప్రారంభం అయింది. ఇవాళ 22కి.మీ దూరం ఈ యాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. అయితే కన్యాకుమారి నుంచి 53 రోజులుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. రైతులు, విద్యార్థులు, గిరిజనులు, చేనేత సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బీజేపీ విద్వేషం, టీఆర్ఎస్ దోపిడీపై విమర్శలు కురిపిస్తూ వెళ్తున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేటు పరం అవుతోందంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పెద్దాయిపల్లి వద్ద జోడో యాత్రకు భోజన విరామం ఉంది. అక్కడే యాత్రలో పాల్గొంటున్న వారంతా భోజనం చేయనున్నారు. అనంతరం సాయంత్రం షాద్ నగర్ సోలిపూర్ జంక్షన్ కు చెరుకోనున్నారు. అక్కడే రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. 






నేతలతో పరుగులు పెట్టించిన రాహుల్ గాంధీ..


భారత్ జోడో యాత్రలో ఆదివారం ఉదయం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ కాసేపు ఉత్సాహంగా పరుగులు పెట్టారు. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ శ్రేణులను పరుగులు పెట్టించారు. ఫిట్‌నెస్ ఫర్ భారత్ జోడో అంటూ రాహుల్ గాంధీ కొద్దిసేపు పరుగు తీసి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతలు, కార్యకర్తలు రాహుల్ ను అనుసరించి రన్నింగ్ చేశారు.






తెలంగాణాలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతూ నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాధారణ బ్రేక్ తీసుకోనున్న రాహుల్ పాదయాత్ర, ఆపై 12 రోజులపాటు జనజీవన స్రవంతితో ముందుకు సాగనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరి కొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరి కొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధీ రోజుకు 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయనుండగా నెక్లెస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు.


అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర.. 


తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలో అడుగుపెట్టే పాదయాత్ర, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, రాజేంద్ర నగర్, బహుదూర్ పుర, చార్మినార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్ పల్లి, శేరిలింగపల్లి, పటాన్ చెరువు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మహబూబ్ నగర్, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, జహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా కొనసాగనుంది. ఇక నాలుగు రాష్ట్రాలను దాటుతూ వచ్చిన రాహుల్ పాదయాత్రలో అతిపెద్దనగరంగా హైదరాబాద్ లో ప్రవేశించనుండగా నగరంలో ఆరాంఘర్, చార్మినార్, మొజాంజాహి మార్కెట్, గాంధి భవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగిపేట, పెద్ద శంకరం పేట, మద్కూర్ మీదుగా కొనసాగనుంది. 


యాత్రలో మేధావులు, మత పెద్దలు, వివిధ వర్గాలు.. 


రాహుల్ తెలంగాణలో జరిపే యాత్రలో భాగంగా మేధావులు, వివిధ సంఘాల నాయకులు, వివిధ వర్గాలు, మత పెద్దలు, రాజకీయ, క్రీడా, వ్యాపార, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులతో భేటి అవనుండగా కొందరు రాహుల్ తో యాత్రలో పాదం కలిపేందుకు సిద్దమవుతున్నారు. ప్రదానంగా తెలంగాణాలో రాహుల్ యాత్రలో కొన్ని ప్రార్ధనా మందిరాలు, మసీదులు, హిందూ ఆలయాలను సందర్శించనున్నారు. సర్వమత ప్రార్థనలు కూడా చేయనున్నారు.