Putta Madhu Padayatra: 15 ఏళ్లుగా సమాజానికి అన్నం పెడుతుంటే ఓర్వలేక కొందరు తనపై అనవసరంగా అభాండాలు వేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. కావాలనే తనను ప్రజలకు దూరం చేయాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ముత్తారం మండల కేంద్రంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, భూపాలపల్లి జడ్పీ ఛైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ తో కలిసి ఆంజనేయ స్వామి ఆళయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాలు లేకుండా ఓ పేద బిడ్డ రాజకీయంగా ఎదిగితే ఓర్వేలేక పోతున్నారని పేర్కొన్నారు. 15 సంవత్సరాలుగా మంథని నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండగా నిలిచి ఆదుకుంటుంటే.. రూపాయి సాయం చేయని వాళ్లు నిందారోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి వ్యక్తిని ప్రాణాలతో ఉండగానే చంపేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా తనపై కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతున్నారని, కుల సంఘాలు, హైదారాబాద్‌లోని కొన్ని మీడియా సంస్థలు పని గట్టుకుని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వివరించారు. 


ఇటీవలి కాలంలో ఆయా కుల సంఘాలను, మీడియా సంస్థలను కలిసి తాను ఏం తప్పు చేశానని అడిగితే వాళ్లు సమాధఆనం ఇవ్వలేకపోయారని పుట్ట మధూకర్ అన్నారు. ముత్తారం మండలానికి చెందిన ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో తనను దూషిస్తుంటే.. స్వయంగా వెళ్లి మాట్లాడానని వివరించారు. అయితే తనను దూషించమని ఎమ్మెల్యే రూ.50 లక్షలు ఇచ్చారని, రూ.25 లక్షలు తాను ఇస్తే తనవైపు వస్తానని చెప్పాడని తెలిపారు. తనవద్ద రూపాయి కూడా లేదని.. ఏమీ ఇచ్చుకోలేనని చెప్పినట్లు స్పష్టం చేశారు. పేద బీసీ బిడ్డపై అభాండాలు, అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్‌ యకులపై ప్రశ్నించాల్సిన అవసరం ఈ ప్రాంత ప్రజలపై ఉందని పుట్ట మధు చెప్పుకొచ్చారు. తనను సంపుకుంటారో సాధుకుంటారో ప్రజలే నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. 2014లో ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేను చేస్తే అనేక కార్యక్రమాలు చేశానని, ఈ ప్రాంతాన్ని అభివృధ్ది పథంలో ముందుకు నడిపించానని అన్నారు. 


తల్లిదండ్రులకు ఆడబిడ్డ కాన్పు బారం కావద్దని ఆలోచన చేసి మంథనికి మాతా శిశు ఆస్పత్రిని తీసుకు వచ్చానని, నాడు ఎంతో మంది పేదంటి ఆడబిడ్డలకు పైసా ఖర్చు లేకుండా కాన్పులు చేస్తున్నారని ఆయన అన్నారు. 40 ఏళ్లు అధికారంలో ఉన్న ఒక్క కుటుంబం ఇలా ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. మన ఓట్లతో అధికారంలోకి వచ్చి మన ఆకలి తీర్చాలని, మన కష్టాలు తీర్చాలని ఏనాడు ఆలోచన చేయలేదని, అధికారం కోసం ఆరాట పడ్డారే కానీ మన గురించి పట్టించుకోలేదని తెలిపారు. 40 ఏళ్లు ఎమ్మెల్యే కుటుంబం ఏం చేసిందని ఒకసారి ఆలోచన చేయాలని ఆయన అన్నారు.  అంతే కాకుండా మంథనిలాంటి ప్రాంతంలో ఎంతో మంది అద్దె ఇళ్లల్లో ఉంటున్నారని, అలాంటి వారి ఇంట్లో ఎవరైన చనిపోతే కనీసం మృతదేహాన్నిఆ అద్దె ఇంట్లోకి తీసుకురానివ్వక రోడ్డుపైనే మృతదేహాలను ఉంచిన సంఘటనలు చూసిన తాను ఇక అద్దె ఇంట్లో ఉండేవాళ్లు ఎవరైనా మృతి చెందితే ఆ పరిస్థితులు రాకుండా డబుల్‌ బెడ్‌ రూంలతో ముక్తీభవన్‌ నిర్మించామని ఆయన వివరించారు. 


తనపై ఆరోపణలు చేసేటోళ్లు ఆధారాలతో దొరికినా మంచి వాళ్లలాగే చలామణి అవుతున్నారని పుట్ట మధు అన్నారు. ముత్తారం మండలానికి చెందిన పోతిపెద్ది కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నచ్చక బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరితే ఆయన ఇంట్లో గంజాయి పెట్టించడానికి ప్రస్తుత ఎమ్మెల్యే కుట్ర చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని ఆయన గుర్తు చేశారు. అలాంటి నాయకులు దర్జాగా ఓట్ల కోసం వస్తున్నారని, వాళ్లనే మంచివాళ్లని ప్రజలు నమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కట్టుకున్న బంగ్లా, తిరుగుతున్న కార్లు మాత్రమే చూస్తున్నారే కానీ తన ఆకాంక్ష, తపనను ఎందుకు అర్థం చేసుకోవడం లేదన్నారు. తాను ఎలాంటి బంగ్లా కట్టుకున్నానో అలాంటి బంగ్లాలే ఊరూరా కట్టించాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతున్నానని పుట్ట మధు వెల్లడించారు. ప్రజల కష్టాలు కళ్లారా చూడాలనే పాదయాత్రకు శ్రీకారం చుట్టానని, ఈ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు పూర్తిగా తెలుసుకుని పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. ఐదేళ్ల కాలం వృధా అయిందని, తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈనాడు ఓడేడ్‌ బ్రిడ్జి పూర్తయ్యేదా కాదా అని అడిగారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా పట్టుదలతో ముత్తారం నుంచి భూపాలపల్లి వరకు రహదారి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తున్నానని, ఈ రహదారి నిర్మాణంతో ప్రజల రాకపోకలకు దూర భారం తగ్గుతుందన్నారు.


ఇలాంటి ఆలోచనలు గత పాలకులు ఏనాడు చేయలేదని పుట్టమధు విమర్శించారు. తనకు ఈ ప్రాంత ప్రజలతో ఉన్నది ఓటు బంధం కాదని పేగు బంధమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్సోళ్లు కాగితాలను పంచుతున్నారని, ఐదేళ్ల కాలంలో అభివృధ్ది పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓట్లు వస్తేనే కాంగ్రెస్సోళ్లకు ప్రజలు గుర్తుకు వస్తారని, ఈ క్రమంలోనే మళ్లీ ఓట్ల కోసం మన ముందుకు వస్తున్నారే కానీ ఏదో చేస్తారని కాదన్నారు. మళ్లీ రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని రాహుల్‌ గాంధీ చెప్పారని, మా ప్రభుత్వం లేదనేటోళ్లకు ఓట్లు వేస్తే ఏం లాభమని ఆయన అన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఒక ప్రకటన చేశానని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంథని ప్రాంతంలోని ప్రతిపేద బిడ్డకు రూపాయి ఖర్చు లేకుండా ఉన్నత చదువుల బాధ్యత తనదేనని ఆయన ఈ సందర్బంగా ప్రకటించారు. 2014లో మీ ఆశీర్వాదంతో మంథని నియోజక వర్గానికి వెలుగులు వచ్చినట్లే వచ్చి మళ్లీ పోయాయని, ఈసారి ప్రజలు ఆశీర్వాదంతో మంథని ప్రాంతానికి వెలుగులు రావాలని కోరుకుంటున్నట్లు పుట్ట మధు కోరుకున్నారు.