తెలంగాణలోని హనుమకొండకు ఇవాళ (బుధవారం - జూన్ 17) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విచ్చేశారు. జన్యుపరమైన వ్యాధితో, తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న అభిమాని నిరంజన్ (Pawan Fan - Hanumankonda Niranjan) కోరికను మన్నించి, అతని ఇంటికి వచ్చిన ఆయన... బాలుడిని పరామర్శించి అతడిలో ధైర్యాన్ని నింపారు.
ఒక్కసారైనా పవన్‌ను కలవాలని...అభిమాని కోరిక తెలిసిన వెంటనే స్పందన!హనుమకొండలోని హనుమాన్ నగర్‌కు చెందిన నిరంజన్ వయసు 17 ఏళ్ళు. కొన్ని ఏళ్లుగా అతను జన్యుపరమైన వ్యాధితో బాధ పడుతున్నాడు. వయసుతో పాటు మిగతా అందరి వ్యక్తుల తరహాలో అతని శరీరం పెరగలేదు. చిన్నారిలా ఉన్నాడు. ఎలాగైనా సరే తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలన్నది ఆ బాలుడి చిరకాల కోరిక. ఈ విషయం పవన్ దృష్టికి వెళ్లడంతో... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు.హనుమాన్ నగర్‌లోని బాలుడి నివాసానికి బుధవారం ఉదయం చేరుకున్నారు. ''నాకు చిన్నప్పటి నుంచి మీరంటే అభిమానం'' అని నిరంజన్ చెప్పిన మాటలు విని పవన్ కల్యాణ్ కదలిపోయారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని బాలుడికి కప్పి, కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే, భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమకు ఆలయంలో పూజ చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు. పవన్‌ను ఇమిటేట్ చేస్తూ నిరంజన్ గతంలో చేసిన డ్యాన్స్ వీడియోలు, ఫొటోలను జనసేనాని చూశారు. తనను చుట్టుపక్కల వారంతా చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పారు.
కుక్క పిల్ల బొమ్మ చూపించి పెంచుకోవాలని ఉందనినిరంజన్ చెప్పగా... కొని పంపుతానని పవన్ హామీ ఇచ్చారు. అయితే... కుక్కను పెంచుకోవడానికి ఇంటి యజమాని అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా... స్వయంగా ఆ ఇంటి ఓనర్లను పిలిపించి పవన్ మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రులు గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్‌లో పని చేసే వాళ్ళమని చెప్పగా... వాళ్ళతో క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు చెప్పారు పవన్. బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.
నిరంజన్ ఇంటికి చేరుకున్న పవన్, ఆ బాలుడిని ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కాసేపు బాలుడితో మాట్లాడారు. తన అభిమాన కథానాయకుడు తనతో కాసేపు గడపటంతో ఆ బాలుడు ఎంతో సంతోషించాడు. తన కళ్ల ముందే ఫెవరేట్ హీరో ఉండటంతో నిరంజన్ ఆనందానికి అవధుల్లేవు. సామాన్య అభిమాని కోసం బిజీ షెడ్యూల్ మధ్య సమయం కేటాయించి పవన్ కల్యాణ్ తమ ఇంటికి రావడంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
పవన్ రాకతో భారీగా వచ్చిన అభిమానులుహనుమకొండకుపవన్ కల్యాణ్ వస్తున్నారన్న సమాచారం తెలియడంతో... ఆయనను చూసేందుకు హనుమాన్ నగర్ పరిసర ప్రాంతాలకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. దాంతో ఆ ప్రాంతం అంతా పవన్ నినాదాలతో మార్మోగిపోయింది. అభిమానులను అదుపు చేసేందుకు పవన్ భద్రతా సిబ్బంది, పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
నిరంజన్ పరామర్శ పూర్తయిన వెంటనే వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు పవన్. ఆయన వెంట జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తదితరులు ఉన్నారు.
