ఖమ్మం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్యతో ఇప్పుడు ఖాకీలకు విపక్షాలకు మధ్య పెద్ద గ్యాప్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది. పింక్‌ పోలీస్‌లు అనే నినాదంతో బీజేపీ బహిరంగంగా విమర్శలు చేస్తుండగా మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సైతం అదే స్టైల్‌లో విరుచుకుపడుతోంది. తాజాగా ఖమ్మం ఏసీపీపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేసిన విమర్శలు అందుకు ఉదాహరణగా మారుతున్నాయి. 
 


బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ ఆత్మహత్య తర్వాత విపక్షాలు ఇంతగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు పోలీసులపై విమర్శలు చేసేందుకు అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వం ఉనప్పటికీ ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకు, ఆ పార్టీకి అటు అధికారులు, పోలీసులు కొంత మేరకు సానుకూలంగా ఉండటం సహజం. అయితే ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా అదే తీరు ఉంటుంది. అయితే ఇది కాస్తా శృతిమించడం వల్లే విపక్షాలు ఇలా విమర్శలు చేస్తున్నాయనే తెలుస్తోంది. ఖమ్మం నగరంలో పనిచేసే పోలీసులు విపక్ష నాయకుల పట్ల ఏక పక్షంగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.


మాట వినకపోతే రౌడీషీటే..?
ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరైనా చురుగ్గా ఉంటే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అవసరమైతే రౌడీషీట్లు ఓపెన్‌ చేయడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాయిగణేష్‌ ఆత్మహత్యకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు అందుకు నిదర్శనంగా పలువురు చెబుతున్నారు.


కాంగ్రెస్‌ పార్టీ నుంచి తన భార్యను కార్పోరేటర్‌గా గెలిపించుకున్న ముస్తఫాపై కావాలనే పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, పీడీ యాక్ట్‌ నమోదు చేసి ఆరు నెలలపాటు జైలుకు పంపారని ఆ పార్టీకి చెందిన నాయకులు పేర్కొంటున్నారు. దీంతోపాటు రఘునాథపాలెం మండలంలో అక్రమ క్వారీల విషయంపై పోరాటం చేసిన కుల సంఘాల నాయకుడు భద్రునాయక్‌పై రౌడీషీట్‌ తెరవడం అప్పట్లో చర్చానీయాంశంగా మారింది.


అయితే ఈ రెండు ఉదంతాలు సైతం రాజకీయ ఒత్తిడి వల్లే జరిగాయని ప్రతిపక్షాలు విమర్శలు చేశారు. తాజాగా బీజేపీకి చెందిన సాయిగణేష్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో ఇప్పుడు పోలీసులపై విపక్షాలు విమర్శలకు పాల్పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులపై ఖమ్మం ఏసీపీ రామాంజనేయులు ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శలు చేయడంతో ఆ పార్టీ జిల్లా నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కేసులు సర్వసాధారణమేనని అయితే ఏకపక్ష నిర్ణయాలతో అతివేధింపులకు పాల్పడటం వల్లే ఖమ్మం నగరంలో ఇప్పుడు పోలీసులకు విపక్షాలకు మధ్య భారీ గ్యాప్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది.


పార్టీ ఫిరాయింపుల టైంలో సైతం ఈ పోలీస్‌ కేసులను ఎక్కువగా వినియోగించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇలా ఏకపక్షంగా ఉండటం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుండగా తమ విధులు తాము నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ఖాకీలకు విపక్షాలకు మధ్య ఏర్పడిన గ్యాప్‌ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.