Sammakka Saralamma Mulugu News: ములుగు జిల్లా పేరు మార్చడం కోసం మరో ముందడుగు పడింది. పేరు మార్చుతూ ఓ పబ్లిక్ నోటీస్ జారీ చేశారు. సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభల నిర్వహించనున్నారు. అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా అందజేయాలని కలెక్టర్ కోరారు.


జూలై 3 న ప్రత్యేకంగా ప్రతి గ్రామంలోనూ సభలు నిర్వహించి అందులో గ్రామస్థులు అందరూ చర్చించి.. అందుకు సంబంధించిన కాపీని జిల్లా పంచాయితీ కార్యాలయంలో ఇవ్వాలి. జిల్లా పేరును సమ్మక్క- సారలమ్మ ములుగు జిల్లాగా మార్చేందుకు విడుదల చేసిన ములుగు జిల్లా రాజపత్రం అధికారిక ప్రచురణ ఫారం నెంబర్ 1ను సమస్త గ్రామ పంచాయితీలలో నోటీసు బోర్డుపై అతికించాల్సి ఉంటుంది. అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా ములుగు జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలి. అలా ములుగు జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు ప్రత్యేక గ్రామసభల నిర్వహణ పర్యవేక్షిస్తుంటారని జిల్లా పంచాయితీ అధికారి సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.


బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో తొలి విడత అధికారంలోకి వచ్చాక పరిపాలన సౌలభ్యం కోసం ఉన్న 9 జిల్లాలను విభజించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాత జిల్లాల స్థానంలో 31 జిల్లాలను ఏర్పాటు చేసింది. తర్వాత తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందంటూ.. డిమాండ్లు రావడంతో నారాయణపేట, ములుగు జిల్లాలను 2019 ఫిబ్రవరిలో ప్రకటించారు. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది. 


ఇలా కొత్త జిల్లాగా ఏర్పడక ముందు ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉండేంది. ప్రస్తుతం ములుగు జిల్లాలో 9 మండలాలు, 174 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అతిపెద్ద గిరిజన జాతర జరిగే సమ్మక్క సారలమ్మ జాతర (Sammakka Saralamma Jatara) అక్కడే జరుగుతూ ఉండడంతో ఆ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ప్రఖ్యాత వ్యక్తుల పేర్లు, లేదా ప్రముఖుల పేర్లు పెట్టాలని డిమాండ్లు వస్తున్నాయి.


జిల్లాను మార్చే యోచనలో కాంగ్రెస్ సర్కార్


తెలంగాణలో 33 జిల్లాలు ఉండడంతో అవి పరిపాలన విషయంలో కాస్త తికమకగా ఉన్నాయని గతంలో ఓ సందర్భంలో రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారీతిన జిల్లాలు చేసేశారని రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస సర్కారును ప్రశ్నించారు. తాము మాత్రం 33 జిల్లాలను కుదించి 17 జిల్లాలకు పరిమితం చేస్తామని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అయితే, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.