Minister KTR: వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కుకు వెళ్లారు. అక్కడే యంగ్ వన్ కంపెనీ ఎవర్ టాప్ టెక్స్ టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం కంపెనీ ప్రతినిధులు, పార్కులో వస్త్ర పరిశ్రమలను నిర్మిస్తున్న ఇతర ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో టెక్స్ టైల్ పార్కుకు చేరుకున్న మంత్రి కేటీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, యంగ్ వన్ కంపెనీ ప్రతినిధులు స్వాగతం పలికారు. టీస్ఐఐసీ టెక్స్ టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీకి ఇటీవల 298 ఎకరాలకను కేటాయించింది. 






తమ వస్త్ర పరిశ్రమల్లో 11 వేల 700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం కల్పించనున్నట్లు సౌత్ కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. పరోక్షంగా మరో 11 వేల 700 మందికి కూడా ఉపాధి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. యంగ్ వన్ కంపెనీ టెక్స్ టైల్ పార్కులో రూ.840 కోట్లు పెట్టనుంది. అనంతరం మంత్రి కేటీఆర్ ఖిలా వరంగల్ కు వెళ్లనున్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్ లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. దేశాయిపేట వద్ద రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్ బెడ్ రూం ఇండ్లను, వరంగల్ లో రూ.135 కోట్లతో చేపట్టి 16 స్మార్టు రోడ్లను కేటీఆర్ ప్రారంభిస్తారు. రూ.75 కోట్లతో వరంగల్ మోడల్ బస్ స్టేషన్, రూ.313 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. 



నిన్నటికి నిన్న జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్


సమస్యల పరిష్కారం కోసం సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పని లేదని.. భాగ్యనగరంలో వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. నేటి నుంచి కొత్త పాలను అందించబోతున్నట్లు స్పష్టం చేశారు. పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రభుత్వం కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే మంత్రి మాట్లాడుతూ.. వార్డు అధికారితో పాటు ఒక్కో వార్డులో 10 మంది చొప్పున 150 వార్డుల్లో మొత్తం 1500 మంది అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారని వివరించారు. ఎంతకాలం సమస్యలు పరిష్కరించాలనే విషయమై వార్డు కార్యాలయంలో పౌర సరఫరాల పత్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల జనాభా ఉండగా.. అందులో కోటి మందికి పైగా హైదరాబాద్ లోనే ఉన్నారని చెప్పారు.