Minister Errabelli: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ రోజు రైతు దినోత్సవం జరుపుతుండగా... రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆయా రైతు వేదికల దగ్గర జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్, పరకాల నియోజకవర్గం గవిచర్ల, పాలకుర్తి నియోజకవర్గం కంఠాయ పాలెం, అమ్మపూరం, కొడకండ్ల మండలం ఏడు నూతుల గ్రామాల క్లస్టర్లలోని రైతు వేదికల వద్ద మంత్రి రైతు దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈక్రమంలోనే పెద్ద ఎత్తున రైతులు.. రైతు వేదికల వద్దకు వచ్చారు. ఈ సందర్భంగానే మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అన్నారు. 


అలాగే రైతుల కోసం సీఎం కేసీఆర్ చేసినట్టుగా చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదంటూ వివరించారు. రైతులకు ఎదురు పెట్టుబడి ఇస్తున్న ప్రభుత్వం ఒక్క తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పారు. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని రాష్ట్రంలో పండుగ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. వ్యవసాయానికి అవసరమైన అన్ని వసతులు కల్పించిన సీఎం కేసీఆర్.. రుణమాఫీ, సమృద్ధిగా నీరు, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత కరెంట్, ఎదురు పెట్టుబడి రైతు బంధు, రైతు బీమా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. గతంలో వ్యవసాయం ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో రైతులే చెప్పాలని అన్నారు. రైతుల భూములకు భద్రత కల్పిస్తూ.. ధరణి పోర్టల్ తెచ్చారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. 


గతంలో వరంగల్ జిల్లా 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో మూడు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 57,801 కోట్ల రూపాయల రైతుబంధు అందించామని చెప్పారు. 4,339 కోట్ల రూపాయల రైతు బీమాను ఇచ్చామని, రైతులు పండించిన ప్రతి విత్తనాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. జూన్ 15వ తేదీతో పాటు నవంబర్ 10వ తేదీలోపు నారు నాటితే... అకాల వర్షాల వల్ల పంట దెబ్బతినదని రైతులకు సూచించారు. ఈ దిశగా రైతులు ఆలోచించి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.


రైతు వేదికలు, రైతు కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించి, పంటల నష్టాలకు ఎకరాకు 10 వేల పరిహారం ఇస్తూ, రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నది సీఎం కేసీఆర్ అని అన్నారు. వీటివల్లే రాష్ట్రంలో పంట దిగుబడులు పెరిగాయని చెప్పారు. దేశానికే కాదు, దేశ విదేశాలకు కూడా తెలంగాణ ప్రజలు పండించిన పంటలు వెళ్తున్నాయన్నారు. రైతును రాజు చేయడానికి ఇంతగా కష్టపడుతున్న సీఎం కేసీఆర్ దయవల్లే నేడు వ్యవసాయం పండుగగా మారిందన్నారు. తెలంగాణ వస్తే.. ఏం జరుగుతుందని అన్న వాళ్లకు అసలైన సమాధానం వ్యవసాయ రంగమే అని చెప్పుకొచ్చారు. రైతులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి అండగా మనమంతా, ముఖ్యంగా రైతాంగం అండగా నిలవాలన్నాు. ఈ కార్యక్రమాల్లో ఆయా ప్రాంతాల రైతులు, మహిళా రైతులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయా శాఖల అధికారులు, రైతుబంధు సమితి ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.