తెలంగాణలో పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించిన ఫైనల్ పరీక్షల ఫలితాలు మే 31న వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో నియామక ప్రక్రియ తుదిదశకు చేరినట్లయింది. తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు తర్వాతి దశలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తెలంగాణ పోలీసు నియామక మండలి మొత్తం 17,516 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు పూర్తయిన తర్వాత మొత్తం 1,79,459 మంది అభ్యర్థులు తుది రాతపరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొత్తం 1,50,852 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టుల్లో అర్హత సాధించారు. ఆ జాబితాను వడబోసిన అనంతరం మొత్తం అభ్యర్థుల సంఖ్య 1.09 లక్షలు ఉన్నట్లు అధికారులు నిర్దారించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలీస్ యూనిట్ల వారీగా ఉన్న ఖాళీల ఆధారంగా ఆయా జిల్లాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇందుకోసం కటాఫ్ మార్కులే కీలకపాత్ర పోషించనున్నాయి. జిల్లాల్లో పోస్టులకు అనుగుణంగా.. సామాజిక వర్గాల వారీగా ఖాళీల ఆధారంగానే కటాఫ్ మార్కుల్ని నిర్ణయించి, ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేయనున్నారు.
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కోసం రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు కేంద్రాలతోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు. అయితే 587 ఎస్ఐ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ధ్రువపత్రాల్లో పెద్దగా తప్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. వీరిలో 20-30 మంది మాత్రమే అనర్హులుగా తేలే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదే 16,929 కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో మాత్రం 700-800 మంది అనర్హులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొంతమంది కావాలనే తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించే అవకాశాలను తోసిపుచ్చలేమని మండలి వర్గాలు అంటున్నాయి.
మరోవైపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలనే ప్రణాళికల్లో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 1.09 లక్షల మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించాల్సి ఉండటంతో ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున 500-600 మంది అభ్యర్థులను పిలవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రక్రియను 10-12 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా జూన్ మూడో వారంనాటికి సర్టిఫికేట్ల పరిశీలన ఓ కొలిక్కివచ్చే అవకాశం ఉంది.
తుది ఫలితాలకు సంబంధించి ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 98,218; ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టులకు 43,708; ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు 4,564; ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టులకు 729, ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలకు 1,779; ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాలకు 1,153; ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాలకు 463, ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టులకు 238 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
శిక్షణకు వడివడిగా ఏర్పాట్లు..
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్ పరీక్షల ఫలితాలు మే 30న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడటంతో అభ్యర్థులకు శిక్షణ దిశగా పోలీస్‌శాఖ కసరత్తు మొదలుపెట్టింది. తుది రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను నెలాఖరులోపు వెలువరించే అవకాశం ఉంది. ఎంపికైన ఎస్‌ఐ అభ్యర్థులకు రాజా బహద్దూర్ వెంకట్రాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇక కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి 9 నెలలపాటు శిక్షణ కోసం టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ శిక్షణ కేంద్రాలు(బీటీసీలు), పోలీస్ శిక్షణ కళాశాలలు(పీటీసీలు), నగర శిక్షణ కేంద్రాల(సీటీసీలు) మైదానాల్ని వినియోగించేందుకు పోలీస్‌శాఖ సన్నాహాలు చేస్తోంది. ఐజీ తరుణ్‌జోషి నేతృత్వంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో శిక్షణ విభాగం నిమగ్నమైంది. జులైలో శిక్షణ ప్రారంభించే అవకాశాలున్నాయి.
Related Articles:
➥ ఎస్‌ఐ, కానిస్టేబుల్ శిక్షణకు ఏర్పాట్లు, జులై నుంచి అభ్యర్థులకు ట్రైనింగ్!
➥ ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫైనల్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల - రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం!