తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్ పరీక్షల ఫలితాలు మే 30న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడటంతో అభ్యర్థులకు శిక్షణ దిశగా పోలీస్‌శాఖ కసరత్తు మొదలుపెట్టింది. తుది రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను నెలాఖరులోపు వెలువరించే అవకాశం ఉంది. తుది ఫలితాలకు సంబంధించి ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 98,218; ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టుల‌కు 43,708; ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు 4,564; ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టుల‌కు 729, ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవ‌ర్, డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌కు 1,779; ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాల‌కు 1,153; ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాల‌కు 463, ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టుల‌కు 238 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.


కానిస్టేబుల్, ఎస్‌ఐ ఫలితాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎస్‌ఐ, కానిస్టేబుల్ మార్కుల వివరాలు, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..


జులై నుంచి శిక్షణ..
ఎంపికైన ఎస్‌ఐ అభ్యర్థులకు రాజా బహద్దూర్‌ వెంకట్రాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇక కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి 9 నెలలపాటు శిక్షణ కోసం టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ శిక్షణ కేంద్రాలు(బీటీసీలు), పోలీస్‌ శిక్షణ కళాశాలలు(పీటీసీలు), నగర శిక్షణ కేంద్రాల(సీటీసీలు) మైదానాల్ని వినియోగించేందుకు పోలీస్‌శాఖ సన్నాహాలు చేస్తోంది. ఐజీ తరుణ్‌జోషి నేతృత్వంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో శిక్షణ విభాగం నిమగ్నమైంది. జులైలో శిక్షణ ప్రారంభించే అవకాశాలున్నాయి.


మూడొంతుల మంది శిక్షణకే అవకాశం..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మైదానాలను పరిగణనలోకి తీసుకుంటే మూడొంతుల మంది వరకే శిక్షణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి చేపట్టిన నియామకాల సరళిని పరిశీలిస్తే ఆబ్కారీ, అగ్నిమాపక, రవాణా, జైళ్లశాఖలవి పోను మొత్తం 17,516 పోలీస్‌ పోస్టులున్నాయి. వీటిల్లో 4,965 సివిల్‌, 4,423 సాయుధ విభాగం, 5,010 టీఎస్‌ఎస్‌పీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మైదానాల్లో 12,000 మంది వరకు శిక్షణ ఇచ్చే సామర్థ్యముంది. ఇలాంటి పరిస్థితుల్లో శిక్షణ మైదానాల సామర్థ్యాన్ని పెంచాలని భావించారు. భవిష్యత్తులో ఇంత భారీ స్థాయిలో నోటిఫికేషన్లకు అవకాశం లేదనే అంచనాలున్నాయి.  


మైదానాల సామర్థ్యాన్ని పెంచడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు కనిపిస్తోంది. సివిల్‌, ఏఆర్‌ విభాగాలకు సంబంధించిన పోస్టుల ప్రాధాన్యం దృష్ట్యా గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఈ కేడెట్లకే తొలుత శిక్షణ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్‌ఎస్‌పీ ఆధ్వర్యంలోని బీటీసీల్లోనూ వీరికే శిక్షణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే టీఎస్‌ఎస్‌పీ కేడెట్ల శిక్షణ వచ్చేఏడాది ఆరంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 నోటిఫికేషన్‌లో భాగంగా టీఎస్‌ఎస్‌పీ కేడెట్ల శిక్షణ కూడా ఇలాగే ఆలస్యమైంది. అప్పట్లో సివిల్‌, ఏఆర్‌ కేడెట్ల శిక్షణ పూర్తయిన తర్వాతే 4816 మంది టీఎస్‌ఎస్‌పీ కేడెట్లకు శిక్షణ ఇచ్చారు.


Also Read:


ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫైనల్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల - రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు అవ‌కాశం!
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత మార్చి - ఏప్రిల్ మధ్య కాలంలో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ తుది రాత ప‌రీక్షల్లో 84.06 శాతం మంది అర్హత సాధించారు. ఫలితాలతోపాటు తుది రాత పరీక్ష ఫైనల్ 'కీ' ని కూడా అందుబాటులోకి వచ్చింది. తుది పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను మే 30న సాయంత్రమే ప్రకటించిన పోలీసు నియామక మండలి కొద్ది గంటల్లోనే ఫైనల్ కీని కూడా విడుదల చేసింది. తుది రాత ప‌రీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ మొబైల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి చూసుకోవచ్చు.
ఫైనల్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..