జనగామ జిల్లా దేవరుప్పల చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులపై బీజేపీ నాయకుల చేసిన దాడిపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ముందుగా దాడిలో గాయపడి జనగామ పట్టణం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయకులను మంత్రి పరామర్శించారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి ఉన్నారు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఉచితంగా నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఇంత దారుణంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
500 మంది గూండాలతో బండి పాదయాత్ర..
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 500 మందితో గూండాలతో పాదయాత్ర నిర్వహిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలపైనే కాకుండా సామాన్య జనాలపై కూడా రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న దాడులను ప్రజలే అడ్డుకోవాలన్నారు. దేవరుప్పలలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం జరుగుతున్న రోజే బండి సంజయ్ ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడటం దారుణం అన్నారు. ఈ ఘటన కారణంగా బీజేపీ వైఖరి మరోసారి బయట పడిందన్నారు.
ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటమే దాడికి కారణం..
ప్రజల్లో సానుభూతి పొందడానికే ఇలాంటి ఘటనలకు బీజేపీ పాల్పడుతోందని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ఈ రోజు స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చారని.. ఇదే సమయంలో బండి సంజయ్ యాత్ర పేరుతో దేవరుప్పుల చౌరస్తాకు 500 మంది గూండాలతో వచ్చారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై, మంత్రిని అయిన తనపై ఇష్టానుసారంగా మాట్లాడటమే సమస్యకు దారి తీసింది అన్నారు. ఒకరిద్దరు అలా మాట్లాడొద్దని అనడంతో బీజేపీ గూండాలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలపై దాడులకు దిగారని అన్నారు. కొంచెం కూడా జాలి లేకుండా కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేశారని వివరించారు.
ఉచితంగా నాణ్యమైన చికిత్స..!
సామాన్య పౌరురాలు సత్తెమ్మపై కూడా రాళ్లు రువ్వారని తెలిపారు. అందిన వాళ్ళను వదలకుండా విచక్షణారహితంగా కొట్టారన్నారు. గాయపడిన వారిలో కోతి ప్రవీణ్ చేయి విరిగిందని, శ్రీకాంత్ కాలు విరిగిందని పేర్కన్నారు. అశలే శ్రీకాంత్ వికలాంగుడు అని ఏమాత్రం జాలి లేకుండా వికలాంగుడిపై దాడి చేశారన్నారు. అలాగే వడ్లకొండ శ్రీకాంత్ తల పగిలిందని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. రమేష్ తల, కాళ్ళు, మెడలకు గాయాలు అయి తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. ఈ ఘటనలో పాల్గొన్న వాళ్లని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. పోలీసులు కూడా సరిగా ప్రవర్తించ లేదని.. బాధితులు చెబుతున్నారన్నారు. ఈ ఘటన పై విచారణ జరిపి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఘటనలో గాయపడిన వారికి ఉచితంగా మెరుగైన చికిత్స అందిస్తామన్నారు.