Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద దర్శనమిచ్చిన జువ్వి చెట్టు. కొద్ది సంవత్సరాల క్రితం సమ్మక్క గద్దెను అనుకొని ఉన్న జువ్వి చెట్టు ఎండిపోవడం... భక్తుల విశ్వాసానికి భంగం కలగడంతో శాస్త్రీయ పద్ధతిలో మరో జువ్వి చెట్టు ను ప్లాంటేషన్ చేశారు అధికారులు.
జువ్వి చెట్టు రీ ప్లాంటేషన్.
ఆదివాసీ గిరిజన కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతిదీ ప్రత్యేకత చాటుకోవడంతోపాటు భక్తుల విశ్వాసానికి, ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు, నమ్మకాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. మేడారంలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మలతోపాటు సమ్మక్క గద్దె వద్ద ఉన్న జువ్వి చెట్టుకు సైతం వనదేవతలతో సమానంగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇది మొదటి నుంచి వస్తున్న ఆచారం. అయితే జాతర ప్రారంభమైన నాటి నుంచి గద్దెల వద్ద ఉన్న జువ్వి చెట్టు కొద్ది సంవత్సరాల క్రితం ఎండిపోయి నేలకూలింది. దీంతో అధికారులు అదే స్థానంలో జువ్వి మొక్క నాటారు. అది కూడా ఎండిపోయింది. దీంతో గద్దెల సమీపంలో జువ్వి చెట్టు పెంచి వృక్షంగా మారుతున్న క్రమంలో అధికారులు వట ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో క్రేన్, జేసిబీ సహాయంతో తవ్వి తీశారు. గతంలో సమ్మక్క గద్దె పక్కనే జువ్వి చెట్టు ఉన్న స్థానంలో అధికారులు, ఆదివాసుల సమక్షంలో పూజలు నిర్వహించి సమ్మక్క సారలమ్మకు ఇష్టమైన బుధవారం రోజున జువ్వి చెట్టును రీ ప్లాంటేషన్ చేశారు.
భక్తుల నమ్మకం, ఆదివాసుల విశ్వాసానికి ప్రతీక.
జువ్వి చెట్టును సమ్మక్క తల్లి శక్తికి ప్రతీకగా కోయ గిరిజనులు భావిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతర సమయంలో, సాధారణ సమయంలో భక్తులు ఈ చెట్టు వద్దకు వచ్చి మొక్కులు చెల్లించడం విశ్వాసంగా, ఆదివాసులు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం అడవి, ప్రకృతి, వనదేవతల మధ్య ఉన్న అనుబంధానికి జువ్వి చెట్టు ఒక చిహ్నంగా నిలుస్తుంది.
వనదేవతల చరిత్రకు సాక్షిగా...!
కోట్లాది మంది భక్తులకు వనదేవతులుగా మారిన సమ్మక్క, సారలమ్మ చరిత్రలో వృక్షాలు, గద్దెలు పవిత్రమైనవిగా భావించబడతాయి. చరిత్రకారులు సమ్మక్క, సారలమ్మ లు కాకతీయులతో పోరాడి వీరమరణం పొందినట్లు చెబుతున్నట్లు చరిత్రకారులు చెబుతున్నట్లు ప్రాచుర్యంలో ఉన్న చరిత్ర. అయితే ఆదివాసులు చిలకల గుట్ట వైపు వెళ్లిన సమ్మక్క ఆ గుట్టపై జువ్వి చెట్టు కింద కుంకుమ భరణి రూపంలో దర్శనమిచ్చినట్లు వారి నమ్మకం. అప్పటిని నుంచి జువ్వి చెట్టును ఆదివాసులు విశ్వాసం, ధైర్యానికి ప్రతిగా భావిస్తూవస్తున్నారు.
