మంచిర్యాల: సింగరేణి కొల్లరీస్ కంపెనీ లిమిటెడ్ చరిత్రలో మరో మైలురాయిని నమోదు చేసుకుంది. ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్ నుంచి బయలుదేరిన తొలి బొగ్గు రైల్వే రేక్ మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (STPP) కి విజయవంతంగా చేరుకుంది.
ఇది తెలంగాణ రాష్ట్ర భద్రతలో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ తొలి రేక్ లో 59 బాక్స్ వ్యాగన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 4 వేలు టన్నుల అత్యుత్తమ జీ-10 గ్రేడ్ బొగ్గు ఉంది. ఒడిశా నుంచి 1131 కిలోమీటర్ల దూరం ప్రయాణించి జైపూర్ STPPకి చేరుకుంది. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి.సూర్యనారాయణ, ఎం.తిరుమల రావు రేక్ కు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అన్ లోడింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో STPP ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్, గుర్తింపు పొందిన , ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, అధికార సంఘ ప్రతినిథులు , ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి అధికారులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.
సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి తొలి రైల్ రేక్ రావడం మనందరకీ గర్వకారణం అన్నారు మల్లు భట్టి విక్రమార్క. సింగరేణి చరిత్రలో ఇది చారిత్రక ఘట్టం అన్నారు. తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చడంలో, రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి పాత్ర ఎనలేనిది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సింగరేణిని మరింత బలోపేతం చేస్తూ, ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
నైనీ బొగ్గు బ్లాక్ ను 2015లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణికి కేటాయించింది. దాదాపు తొమ్మిదేళ్లు నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం వేగవంతం చేసింది. 2025 ఏప్రిల్ 16న నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తి అధికారికంగా ప్రారంభమైంది. ఈ బ్లాక్ లో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఏడాదికి కోటి టన్నుల ఉత్పత్తి సామర్థ్యం, 36ఏల్ల గని జీవితకాలం ఉంది. నాణ్యమైన జీ 10 గ్రేడ్ బొగ్గు STPPకి నిరంతర సరఫరా అందించడంలో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తికి దీర్ఘకాలిక స్థిరత్వం లభించనుంది. సింగరేణి అధికారులు ఈ విజయాన్ని సంస్థ విస్తరణలో కొత్త అధ్యాయంగా అభివర్ణించారు. ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదరగడానికి ఇది మొదటి అడుగు అని పేర్కొన్నారు. నైనీ బొగ్గు సరఫరాతో STPP ఇందన భద్రత పెరగడమే కాకుండా, రాష్ట్ర విద్యుత్ రంగం మరింత బలపడనుంది. ఈ చారిత్రక ఘట్టం సింగరేణి ఉద్యోగులు, కార్మికుల కృషికి నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సమన్వయంతో మరిన్ని అభివృద్ధి పథకాలు ముందుకు సాగనున్నాయని అన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.
