Mahabubnagar News: వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన 24 ఏళ్ల చిన్ని నిఖిల్ బెంగళూరులో బీఏఎంఎస్ చేసి అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 29వ తేదీన బెంగళూరు నుంచి కావలికి వెళ్తున్న సమయంలో నిఖిల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు కూడా కుమారుడు కోలుకుంటే బాగుండని కోటి దేవుళ్లకు మొక్కుకున్నారు. కానీ అవేవీ అతడిని కాపాలేకపోయాయి. మే 1వ తేదీన చికిత్స పొందుతున్న నిఖిల్ కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే అంత శోకంలోనూ కొడుకు ఆశయం నెరవేర్చాలని ఆ తల్లిదండ్రులు రమేష్, భారతి ముందుకు వచ్చారు. ప్రత్యేక అంబులెన్స్ లో నిఖిల్ ను సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా... ఆరుగురికి అవయవదాతగా నిలిచాడు. స్టూడెంట్ గా ఉన్న సమయంలోనే అతను ఓ కవిత రాశాడు. అది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 


ఆ కవిత ఏంటంటే..?


నా తనువు మట్టిలో కలిసినా.. అవయవదానంతో మరొకరిలో జీవిస్తా.. ఒక అమ్మకు బిడ్డగా మరణించినా.. మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా.. ఏనాడు వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్లు.. ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె.. కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్ర పిండాలు, ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు, కాలేయం పని చేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం, నాలోని ప్రతీ అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి. ఇదే మీరు నాకు ఇచ్చే గొప్ప బహుమతి. ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను.. చిరంజీవినై ఉంటాను. అవయవదానం చేద్దాం.. మరో శ్వాసలో శ్వాసగా ఉందాం.


అవయవ దానం చట్టంలో కేంద్రం కీలక మార్పులు


65 ఏళ్లు పైబడిన రోగులెవరైనా చనిపోయిన వాళ్ల నుంచి "అవయవం పొందేందుకు" వీలుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. గతంలో ఈ వయో పరిమితి 65గా ఉండేది. ఇప్పుడు 65 ఏళ్లు దాటిన వాళ్లు కూడా అవయవాలు పొందేందుకు అవకాశముంటుంది. 65 ఏళ్ల వాళ్లను ఈ విషయంలో "వృద్ధులుగా" పరిగణించడం సరి కాదని, అందుకే మార్పులు చేశామని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే...ఎక్కువ కాలం బతికుండే అవకాశమున్న యువతీ, యువకులకు అధిక ప్రాధాన్యతనిస్తామని వెల్లడించింది. మొత్తానికైతే...ఇప్పుడు ఎవరైనా సరే చనిపోయిన వారి నుంచి అవయవాలు తీసుకునేందుకు "రిజిస్టర్" చేసుకోవచ్చు. NOTTO వెబ్‌సైట్‌లో ఈ కొత్త గైడ్‌లైన్స్‌ని అప్‌డేట్ చేశారు. అవయవాలు తీసుకునేందుకు రిజిస్టర్‌ చేసుకునే వాళ్లకు ఎలాంటి ఫీజ్‌ వసూలు చేయరు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో కొంత మేర రుసుము వసూలు చేసే వాళ్లు. ఇకపై ఈ ఛార్జీలు విధించడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.