Mahabubabad Transport Office: ఆఫీసుకు మద్యం తాగి రావడం తప్పు అని అందరికీ తెలుసు. అలాంటిది కార్యాలయానికి వచ్చి తాగితే.. మరింత పెద్ద తప్పు అవుతుంది. కానీ, పని వేళల్లో ప్రజలకు తగిన సర్వీసు అందించాల్సిన సమయంలో ఓ వైపు తాగుతూ, మరోవైపు పని చేస్తుంటే.. అందులోనూ ప్రభుత్వ కార్యాలయంలో ఈ పని చేస్తే..? ఇది పెద్ద నేరమే అవుతుంది. కానీ, ఇలా ఎవరూ చేయరులే అనుకోవడానికి లేదు. ప్రభుత్వ కార్యాలయంలో, పని గంటల్లో ప్రజలకు సేవ చేస్తూనే మరోపక్క టీ తాగినట్లుగా బీరు తాగిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. గవర్నమెంట్ ఆఫీస్ టేబుల్ పై బీరు సీసా పెట్టుకొని మధ్యమధ్యలో సిప్ లు వేస్తూ పని చేస్తున్న తీరు అందర్నీ విస్మయానికి గురి చేసింది.


భానుడు ప్రతాపాన్ని చూపిస్తుందడంతో ఎండ తాపం నుండి కాస్త సేద తీరడానికో ఏమో ఓ ఉద్యోగి కార్యాలయంలోనే చల్లని నీరు లాగించేశాడు. పాపం కార్యాలయానికి వచ్చిన ఎవరో ఫొన్ లో ఉద్యోగి బాగోతాన్ని బంధించారు. దీంతో ఉద్యోగి బండారం మొత్తం బయటకు వచ్చింది.


మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి మద్యం సేవిస్తూ విధులు నిర్వహించారు. అయితే సురేష్ కంప్యూటర్ ఆపరేటర్ గా నిధులు నిర్వహిస్తున్నాడు. ఎండ వేడిమి నుండి బయటపడడానికి ఎవరిని పట్టించుకోకుండా బీరు సేవిస్తూ కార్యాలయంలో తన పని తాను చేసుకున్నాడు. బహిరంగ మద్యం సేవించడమే నేరం. అలాంటి ప్రభుత్వ కార్యాలయంలో మద్యం సేవిస్తూ విధులు అంతకంటే నేరం. కానీ అవేమీ పట్టించుకోకుండా దర్జాగా బీరు తాగుతూ పని చేశాడు. 


ఓ పౌరుడు కార్యాలయానికి వచ్చిన సందర్భంలో ఈ వ్యవహారాన్ని తన ఫోన్ లో బంధించారు. దీంతో సురేష్ మద్యం సేవించే వీడియో, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. దీంతో ఉన్నతాధికారులు సురేష్ ను మందలించినట్లు తెలిసింది. అయితే ఈ ఘటన మూడు రోజుల కింద జరిగినట్లు సమాచారం.