Mahabubabad News: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్ర సర్పంచ్ దర్శనాల సుష్మిత.. గ్రామంలో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచారు. అయితే అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరి గ్రామాభివృద్ధికి శ్రమించారు. ఈ క్రమంలోనే గ్రామాభివృద్ధి కోసం 20 లక్షల వరకు అప్పు చేశారు.


గ్రామంలో రోడ్లు, మురికి కాలువలు ఇతర అభివృద్ధి పనులు చేయించారు. కానీ నెలలు గడిచినా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉపసర్పంచ్‌పై అవిశ్వాసం ప్రకటిస్తే అందులో రెండో సంతకం చేసిన వ్యక్తి ఇప్పుడు సుష్మితను ఇబ్బంది పెడుతున్నారు. చేసిన పనులకు బిల్లులు రానీయకుండా సమస్యలు సృష్టిస్తున్నారట. సొంత టీఆర్ఎస్ పార్టీలోనే వర్గం పేరుతో వేరు చేయడం చాలా బాధగా ఉందని సర్పంచ్‌ సుష్మిత అన్నారు. 


తాను ఒక దళిత మహిళనని చిన్న చూపు చూస్తూ గ్రామాభివృద్ధికి సహకరించడం లేదని సుష్మిత ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనికి బిల్లులు రాక, రెండో సంతకందారుడి ఇబ్బందులు భరించలేకపోవడంతోపాటు వడ్డీల భారం పెరుగుతుండటంతో సమస్యలు ఎదుర్కొంటున్నానని తెలిపారు. కుటుంబ పోషణ కోసం గ్రామస్థులతో కలిసి దినసరి కూలీగా పని చేస్తున్నట్లు సర్పంచ్ సుస్మిత తెలిపారు. పెండింగ్ బిల్స్ వస్తే తప్ప తన సమస్యకు పరిష్కారం దొరకదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. 


మూడు నెలల క్రితం నిజామాబాద్ లో సర్పంచ్ భర్త ఆత్మహత్య..


నిజామాబాద్ జిల్లాలో పురుగుల మందు తాగి సర్పంచ్ భర్త ఆత్మహత్య చేసుకున్నారు. వేల్పూర్ మండలంలోని పడగల్ వడ్డెర కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పడగల్ వడ్డెర కాలనీ సర్పంచ్ ముత్తెమ్మ భర్త మల్లేష్ పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి ఇబ్బందుల్లో పడ్డారు. బిల్లులు రాక, తెచ్చిన అప్పులు కట్టలేక ఏం చేయాలో తెలియక గందరగోళ పరిస్థితుల్లో గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైద్యం కోసం ఆర్మూర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.   


బిల్లులు రాక అప్పుల పాలవుతున్న సర్పంచ్‌లు ! 
 
గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఆగిపోయాయినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో పంచాయతీలకు నిధుల కొరత ఏర్పడింది అంటున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం మొదలైన నుంచి పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయడం లేదని విమర్శిస్తున్నారు. అందుకే పంచాయతీల ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడిందని అంటున్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం కేటాయించే నిధులతో సమానంగా తాము కూడా ప్రతి నెలా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కొన్ని నెలల పాటు ఈ విధానం అమలు చేశారు. తర్వాత పట్టించుకోవడం లేదన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ..