Kunamneni on BJP: దేశంలోని అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని దేశమంతా గుజరాత్ మోడల్ అరాచకాలు అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. దేశానికి బీజేపీ క్యాన్సర్ గడ్డలా తయారైందని అన్నారు. అలాగే దాన్ని పూర్తిగా నాశనం చేయాల్సిన అవసరం ప్రజలందరికీ ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని, రాష్ట్రంలోని ప్రగతిశీల శక్తులన్నింటినీ ఏకం చేయాలని సూచించారు. అలాగే ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.


పొంగులేటి డబ్బులతో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని.. కానీ ఖమ్మంలో ఆయన ఆటలు చెల్లవని అన్నారు. ఖమ్మం ప్రజలు చాలా చైతన్య వంతులు అని చెప్పుకొచ్చారు. అలాగే కమ్యూనిస్టులతో పెట్టుకుంటే పొంగులేటికే నష్టం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంచలనం అవుతున్న పేపర్ లీకేజీ కేసులో నిందితుడైన ప్రశాంత్ జైలు నుంచి విడుదలైతే బీజేపీ నేతలు సన్మానం చేయడం దారుణం అని వ్యాఖ్యానించారు. నిందితులను శిక్షించాల్సింది పోయి సన్మానాలు చేస్తున్నారంటేనే బీజేపీ ఏంటో అర్థం అవుతుందంటూ కూనంనేని సాంబశివరాలు అన్నారు. 


సీపీఐని జాతీయ హోదా నుంచి తప్పించడం అవివేకం 


దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీకి  ఎన్నికల కమిషన్ జాతీయ హోదాను ఉపసంహరించడం అవివేక చర్య అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇటీవలే తెలిపారు. ఇలాంటి సమయంలో ఉపసంహరించడం అనేక అనుమానాలకు తావిస్తోందని, జాతీయ హోదాకు గుర్తింపు సంబంధించిన నిబంధనలే తప్పుగా ఉన్నాయని విమర్శించారు. ఈసీ నిర్ణయంపై త్వరలో సవాల్ చేస్తామని తెలిపారు. కేవలం ఎన్నికల ఫలితాల ఆధారంగా జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం సరైంది కాదని కూనంనేని అభిప్రాయపడ్డారు. మన దగ్గర పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బహుళ పార్టీ విధానం ఉందని అన్నారు. ప్రతి ఎన్నికలో అన్ని పార్టీలు, అన్ని స్థానాల్లో పోటీ చేయలేవని తెలిపారు. ఎన్నికల అవగాహనలు, సర్దుబాట్లు ఉంటాయన్నారు.  వీటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా తప్పుడు విధానంలో జాతీయ హోదాను ఎన్నికల కమిషన్ నిర్దారించడం సరైనది కాదన్నారు కూనంనేని. ఎన్నికలు డబ్బులు, ప్రలోభాలమయం అయిపోయాయని, వీటిని అరికట్టలేక ఎన్నికల కమిషన్, ప్రతి ఎన్నికల్లో తన అసమర్థతను చాటుకుంటోందన్నారు.  ప్రతి అభ్యర్థికి పోటీలో సమాన అవకాశాలు కల్పించలేకపోతున్నదని విమర్శించారు. పైగా గత ఎన్నికల్లో ప్రధాని కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై చర్యలు తీసుకోలేకపోయిందని ఆరోపించారు.


గుజరాత్ ఎన్నికల షెడ్యూలు విడుదలను అధికార పార్టీకి అనుకూలంగా ఆలస్యం చేసిందన్నారు. ఇలాంటి వివక్షాపూరితమైన ఎన్నికల కమిషన్‌కు ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు  సంబంధించిన  హోదాపై నిర్ణయించే నైతికత లేదని మండిపడ్డారు కూనంనేని. ప్రస్తుతం మన దేశంలో అవలంభిస్తున్న ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ఎన్నికల విధానమే సరైంది కాదనే చర్చ సాగుతోందని అభిప్రాయపడ్డారు. బహుముఖ పోటీలో 20, 30 శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థులు కూడా గెలుస్తున్నారని, కనీసం 50 శాతం ఓట్లు దాటని విజేతకు జనామోదం లేదని భావిస్తామా? అని ప్రశ్నించారు. ప్రస్తుత ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ విధానాన్ని రద్దు చేసి, దామాషా పద్ధతిలో నిష్పాక్షిక ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయ పార్టీల వాస్తవ బలం బైటపడుతుందన్నారు.